హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మెడపై ‘వేటు’ కత్తి వేలాడుతున్నదా? ఉప ఎన్నికలు తప్పవనే భయం వారిలో వెంటాడుతున్నదా? అందుకే న్యా యానికి చిక్కకూడదని ‘అన్యాయ’దారులు తొక్కుతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. రా ష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌పై రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటం, సుప్రీంకోర్టు తమపై అనర్హత వేటు వేస్తుందన్న భయంతో ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారని ఆయా నియోకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీపై పార్టీ ఫిరాయింపుల నిషేధచట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మొదట్లో దూకుడుగా వ్యవహరించిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు తత్వంబోధపడి రూపాంతరం చెందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతున్నదనే ఆందోళనతో కాస్త పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, కొంతకాలమైనా అనర్హత వేటును వాయిదా వేయించుకునేందుకు, అవకాశం ఉంటే కోర్టును తప్పుదోవ పట్టించేందుకు అనువైన సాకులు వెతుక్కుంటున్నారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతున్నది. కాంగ్రెస్ కండువాలు ధరించి ఫొటోలు దిగి, కాంగ్రెస్ సమావేశాలకు, ఆఖరికి సీఎల్పీ సమావేశానికి హాజరైన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తాను బీఆర్ఎస్లోనే ఉన్నాననే సాక్షం కోసం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అలా ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని గద్వాల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదుచేశారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పేరుతో ఫ్లెక్సీలు వేశారని, ఉద్దేశపూర్వకంగానే తనను అప్రతిష్ఠపాలు చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ ఫిరాయింపులపై ఇటీవల న్యాయస్థానాలు చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తుంటే, రాష్ట్రంలో ఉపఎన్నికలు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టులు కోపంగా ఉన్నాయని న్యాయనిపుణులు చెప్తున్నారు. అటు రాజకీయంగా, ఇటు న్యాయపరంగా జరుగుతున్న పరిణామాలను బట్టి రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఇటీవల భయం మొదలై కొత్తదారులు వెతుక్కుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ న్యాయ పోరాటం
నిరుడు మార్చిలో ఫిరాయింపులపర్వం మొదలైనప్పటి నుంచి పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో, సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తున్నది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సింగిల్‌బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్‌బెంచ్ కొట్టివేసింది. అదే సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తేల్చాల్సిందేనని స్పీకర్‌కు స్పష్టంచేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కోర్టులో ‘సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు’ అని స్పీకర్ కార్యాలయం తరఫు న్యాయవాది పేర్కొనడంతో ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘ఎంతకాలం? మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపుల మాదిరిగా చేస్తారా?’ అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. నోటీసులు ఇవ్వడానికే పది నెలల సమయం తీసుకుంటారా? అని నిలదీసింది. రెండు వారాల గడువు ఇస్తే వివరాలు కనుకొని చెప్తానని ప్రభుత్వం తరుపున న్యాయవాది అభ్యర్థించగా, ‘తెలుసుకొని చెప్పడానికి హైదరాబాద్ వెళ్లకర్లేదు. ఫోన్లో మాట్లాడి కూడా చెప్పవచ్చు’ అని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు, 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పరిశీలిస్తే, మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని నిపుణులు చెప్తున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే గుబులు మొదలైందని జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. పార్టీ మారడంపై ప్రజలు తిరగబడే పరిస్థితి నెలకొన్నదని, అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారనే అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. ‘ఎన్నికలు వస్తే ఓటమి తప్పదేమో.. అన్నింటికీ సిద్ధపడదాం’ అని తమ సన్నిహితులకు సంకేతాలు ఇస్తున్నట్టు ఆయా నియోజకవర్గాల్లో చర్చ సాగుతున్నది.
వేటు తప్పదనే ఎమ్మెల్యేల ‘ఫొటో’ నాటకం
ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమపై వేటు తప్పదనే భయంతోనే నానా సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఉపఎన్నికలు రావడం ఖాయమని గ్రహించి అందుకు అనువైన ఎజెండాను రూపొందించుకుంటున్నారు. తాము పేదల పక్షపాతి అని, కేసీఆర్ ఆశీస్సులు తమకే ఉన్నాయని ఇప్పటినుంచే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము పార్టీ మారలేదని నమ్మబలుకుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీల్లో తమ ఫొటోలు పెట్టుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలు ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటోలు ప్రదర్శించి, తద్వారా ప్రజల్లో అభిమానాన్ని పొందాలని నానా తంటాలు పడుతున్నారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి వ్యవహారం అందులోభాగమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా తన ఇంట్లో కేసీఆర్ ఫొటో పెట్టుకున్నానని చెప్పుకున్నారు. కాంగ్రెస్‌లో చేరి పీఏసీ చైర్మన్ పదవిని స్వీకరించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా తాను పార్టీ మారలేదని చెప్పుకుంటున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇప్పటికీ తన క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ ఫొటోను తొలగించకపోవడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యాలయంపై దాడిచేసి కేసీఆర్ చిత్రపటాన్ని తొలగించి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టారు. మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ‘ఇక తమపై వేటు తప్పదు’ అనే నిర్దారణకు రావడం కేసీఆర్ నామజపం, తాము గులాబీ గూటివారిమనే ప్రచారం చేసుకుంటున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.