Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పదేండ్లలో ఏటేటా సగటు న 10 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.72 కోట్లకు చేరింది. రాష్ట్రం ఏర్పాటయిన 2014 జూన్ 2 నాటికి తెలంగాణలో 71.52 లక్షల వాహనాలు ఉండగా పదేండ్లలో కొత్తగా కోటి వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. వాహనాల కొనుగోలుకు బ్యాంకులు పెద్దమొత్తంలో రుణాలు ఇవ్వడం, చిరుద్యోగులు ఉ ద్యోగం రాగానే వెంటనే వాహనాలు కొనుగో లు చేస్తున్నారు.
మధ్య తరగతి ప్రజలు కూడా ద్విచక్రవాహనాలతో పాటు కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. జనాభాలో సగటున ఇద్దరిలో ఒకరికి వాహనం ఉన్నట్టు రవాణాశాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చ ల్ జిల్లాల్లోనే 82.45 లక్షల వాహనాలు.. అంటే రాష్ట్రంలోని 50 శాతం వాహనాలు అక్కడే రిజిస్ట్రేషన్ అయ్యాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 53,430 వాహనాలు, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో 80,010, ఆసిఫాబాద్ జిల్లాలో 88,768 ఉన్నాయి.