హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా దేశ సేవకు అంకితమై పనిచేస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీకి మరో వందేండ్లకుపైగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆకాంక్షించారు. మరో ఐదేండ్లలో 10 కొత్త గను లు, 3 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తితో సుస్థిర ఆర్థిక పునాదులు వేస్తున్నామని చెప్పారు. రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్లో శుక్రవారం జరిగిన సంస్థ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర విభజనకు ముందు తీవ్ర నిరాదరణకు గురైన సింగరేణి ఇప్పడు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అన్ని రంగాల్లో వృద్ధి చెందుతూ దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిచిందన్నారు. టర్నోవర్‌ను రూ.12 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు పెంచామని తెలిపారు. 2029-30 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ ఏడాది 700 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం ద్వారా టర్నోవర్‌ను రూ.32 వేల కోట్లకు, లాభాలను రూ.2 వేల కోట్లకు పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.
సింగరేణి నెలకొల్పిన థర్మల్ విద్యుత్తు కేంద్రం 90 శాతానికిపైగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను సాధిం చి జాతీయ స్థాయిలో నంబర్ వన్‌గా నిలవడం సంస్థ పనితీరుకు నిదర్శనమని శ్రీధర్ పేర్కొన్నారు. సింగరేణి పనితీరుకు మెచ్చిన సీఎం కేసీఆర్ మరో 800 మెగావాట్ల ప్లాంట్ ను అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. అనంతరం సింగరేణిలో ఉత్తమ పని తీరు కనబర్చిన డీజీఎం (ఐటీ) గడ్డం హరిప్రసాద్, ఎస్వోఎం (మారెటింగ్) సురేందర్‌రాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ అహ్మద్, ఎంవీ డ్రైవర్ సుధాకర్‌ను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో అడ్వైజర్ (మైనింగ్) డీఎన్ ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే తదితరులు పాల్గొన్నారు.