సదాశివపేట, ఏప్రిల్ 6: రాష్ట్రంలో ప్రజలందరి కండ్లు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం 50 రోజులు పూర్తి చేసుకొని కోటి మందికి పరీక్షలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ శరత్‌కుమార్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్‌తో కలిసి కేక్ కట్ చేసి బెలూన్లు ఎగురవేశారు. అంతకుముందు ఆయన పట్టణంలో బస్తీ దవాఖానను ప్రారంభించి, కంటి వెలుగు శిబిరంలో అద్దాలు పంపిణీ చేశారు. సదాశివపేట ఎంపీపీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ, రూ.25 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కంటివెలుగు అద్భుతమైన పథకమని అన్నారు.
సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా ప్రజల కష్టాలు తీరుస్తున్నారని, ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకువస్తున్నారని చెప్పారు. కంటివెలుగు పరీక్షలు తెలంగాణలో కోటి దాటడం, ఆ సంబురాలు సదాశివపేటలో జరుపుకోవటం ఆనందంగా ఉన్నదని అన్నారు. ప్రతిపక్షాలు సైతం కంటివెలుగు కార్యక్రమాన్ని మెచ్చుకుంటున్నాయని తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తమ రాష్ర్టాల్లో కంటివెలుగు కార్యక్రమం చేపడతామన్నారని గుర్తుచేశారు. దేశం మెచ్చిన పథం కంటివెలుగు అన్నారు. 1500 బృందాల ద్వారా 50 పనిదినాల్లో కోటి మందికి కంటి పరీక్షలు చేసినట్టు వివరించారు. ఏడు వేల పంచాయతీలు, 2,339 మున్సిపల్ వార్డుల్లో కంటివెలుగు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.
కంటివెలుగు పరీక్షలకు మహిళలే ఎక్కువగా వచ్చారని వారే ఇప్పటివరకు 53 లక్షల మంది పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. 3,279 మంది ట్రాన్స్జెండర్లకు పరీక్షలు చేశామని చెప్పారు. 16.50 లక్షల మందికి దగ్గరిచూపు, 12.50 లక్షల మందికి దూరం చూపు వారికి కండ్ల అద్దాలు అందించామని తెలిపారు. కంటి వెలుగు కోసం సీఎం కేసీఆర్ రూ.250 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ఈ నెల 16 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రారంభించనున్నామని తెలిపారు. గతంలో సర్కారు దవాఖానాల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే అవి 84 శాతానికి చేరాయని చెప్పారు.
డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ర్టాల్లో ఎక్కడా తెలంగాణ తరహాలో పథకాలు లేవన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ పరిధిలో ఒక్క నర్సింగ్ కాలేజీ కూడా లేదని చెప్పారు. తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 950 మంది కొత్త డాక్టర్లను నియమించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, పులిమామిడి రాజు తదితరులు పాల్గొన్నారు.