MLA Padi Kaushik Reddy | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీకి సంబంధించి చలో మొబిలిటీ సంస్థపై, ఎక్సైజ్ శాఖకు సంబంధించి సోం బిస్లరీ వ్యవహారంపై హౌజ్ కమిటీ వేయాలని, వీటిపై విజిలెన్స్, సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఫ్లైయాష్ సరఫరాలో, ఛలో మొబిలిటీ, సోం డిస్టిలరీ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సోం డిస్టిలరీకి కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారని, కానీ ఆ సంస్థ నుంచి కాంగ్రెస్‌కు భారీమొత్తంలో ఫండ్ అందిందని తెలిపారు. 2019-20లో 1.31 కోట్లు, 2013-14లో, 2018-19లో రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు.. మొత్తంగా రూ.1.80 కోట్లు ఇచ్చారని వెల్లడించారు. అధికారికంగానే ఇన్ని నిధులొస్తే, అనధికారికంగా ఇంకెన్ని నిధులు వచ్చాయోనని అనుమానం వ్యక్తం చేశారు.
తెలంగాణలో తమ బ్రాండ్ల సరఫరాకు అనుమతి వచ్చినట్టు సోం బేవరేజెస్ ప్రకటించిందని, ప్రభుత్వం మాత్రం తాము అనుమతి ఇవ్వలేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని క్యాన్సిల్ చేసినట్టు మంత్రి తెలిపారని, కానీ ఆ అనుమతి రద్దు చేయలేదని సెబీ నుంచి సమాధానం వచ్చిందని ఎండగట్టారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం నుంచి తెలంగాణ సీఎంకు డైరెక్షన్ రావటంతో సంబంధిత మంత్రికి తెలియకుండా ఇదంతా జరిగిందని వివరించారు. మధ్యప్రదేశ్‌కు సోం డిస్టిలరీ రూ.575 కోట్లు చెల్లించకపోవటంతో బ్లాక్ లిస్టులో పెట్టారని, ఆ కంపెనీ కల్తీ బీర్లు తాగి చాలా మంది చనిపోయారని గుర్తుచేశారు.
ఫ్లైయాష్ సరఫరాలో భారీ స్కాం జరుగుతున్నదని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. వే బిల్లో ఎలాంటి బరువు నమోదు చేయకుండా, సంతకం లేకుండా సరఫరా చేస్తున్నారని, ఓవర్‌లోడ్‌తో తీసుకెళ్తున్నారని తెలిపారు. తమ కార్యకర్తలు ఓవర్‌లోడ్ లారీలను ఆపితే.. మూడు లారీలను సీజ్ చేసి మిగిలిన లారీలను మంత్రి ఫోన్ చేయగానే వదిలేశారని మండిపడ్డారు. హుజురాబాద్ నుంచి లారీలు వెళితే తాను ఆపుతుండటంతో దారి మళ్లించి హుస్నాబాద్ నుంచి తీసుకెళ్తున్నారని వెల్లడించారు. ఆటోడ్రైవర్లకు నెలకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోయి సుమారు 59 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.
ప్రభుత్వ మనుగడ మద్యంపై ఆధారపడి పనిచేయటం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఈ డబ్బుల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తే ప్రజలకు మంచి చేసినట్టు కాదని అన్నారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నదని, దవాఖానలపాలై రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ గణన చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమలు చెల్లించిన డీడీలు వాళ్లకు ఇచ్చేసి వాళ్ల వాటాలేకుండానే పథకాన్ని అమలు చేయాలని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలిపారు. బీసీలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలని సూచించారు.
ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్‌ను ఆన్లైన్ టెండర్ వేయకుండా ఆఫ్‌లైన్ టెండర్ ద్వారా చలో మొబిలిటీ సంస్థకు అప్పగించారని కౌశిక్‌రెడ్డి తెలిపారు. ఆఫ్‌లైన్ టెండర్‌ను ఎందుకు పిలిచారు? అని ప్రశ్నించారు. టెండర్ పిలిచి రద్దు చేసినట్టు ప్రకటించిన ఆర్టీసీ.. ఆ తర్వాత మళ్లీ ఎలా ఆ సంస్థకు కట్టబెట్టింది? అని నిలదీశారు. ‘ఫెయిర్ కలెక్షన్‌పై తమ బృందం బీహార్, అస్సాం, ఇండోర్, జబల్పూర్కు స్టడీ టూర్‌కు వెళ్లిందని ఆర్టీసీ చెప్తున్నది. టూర్ ఆదేశాలకు, టెండర్ ఇవ్వడానికి మధ్య 3 రోజులే గ్యాప్ ఉన్నది. అంత తక్కువ సమయంలోనే 4 రాష్ర్టాలు ఎలా తిరిగి వస్తారు? అని ప్రశ్నించారు. ఆర్టీఐ ద్వారా టూర్ వివరాలను అడిగితే తమ వద్ద సమాచారం లేదని ఆర్టీసీ చెప్పిందని.. మంత్రికి, ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపిందని.. మరి దీనికి బాధ్యులు ఎవరు? అని నిలదీశారు.