ఫర్టిలైజర్‌సిటీ, సెప్టెంబర్ 22: మంచిర్యాల లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసి బెదిరించి రూ.1.43 కోట్లు లూటీ చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఆదివారం రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు గత జూలై 22న గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ‘హలో నేను ముంబై పోలీస్‌స్టేషన్ నుంచి మాట్లాడుతున్న. మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసు నుంచి బయటపడాలంటే మేం చెప్పిన ఖాతాకు డబ్బు పంపించాలి. మీ డబ్బును చెక్ చేసిన తర్వాత తిరిగి మీ అకౌంట్‌కు పంపిస్తాం. లేదంటే జైలుకు వెళ్లక తప్పదు’ అంటూ బెదిరించడంతో బాధితుడు వణికిపోయాడు.
భయంతో అతడు చెప్పిన విధంగా రూ.1,43,75,000 పలు దపాలుగా బదిలీ చేశాడు. డబ్బులు తిరిగి తన ఖాతాకు రాకపోవడంతో మోసపోయినట్టు గుర్తించాడు. అప్పట్లోనే 1930కి కాల్చేసి ఫిర్యాదు చేయగా సైబర్‌క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడు మనీ ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ అకౌంట్ మహారాష్ట్రలోని వాసిం జిల్లాకు చెందిన సంతోశ్ శ్రీకృష్ణ నాగల్కర్దిగా గుర్తించారు. మహారాష్ట్రకు వెళ్లి ముఠా సభ్యుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అతని అకౌంట్‌కు వచ్చిన డబ్బులు మరో ఖాతాకు బదిలీ అయిన విషయం తెలుసుకున్నారు. తాను కమీషన్ మాత్రమే తీసుకుంటానని, డబ్బులు తీసుకునేది వారే వారని చెప్పాడు. అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని, అసలు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ నిందితుడి ఖాతా ద్వారా ఇప్పటివరకు 18 సైబర్ నేరాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు.