హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుండగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 1.11 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, శ్రీశైలం ప్రాజెక్టుకు 96 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.
తుంగభద్ర నుంచి స్వల్పంగా వరద శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్నది. విద్యుత్తు ఉత్పత్తి ద్వారా జలాలను దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ, గడ్డెన్న వాగుల్లోకి వరద కొనసాగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసానిలో ఆరు, తాలిపేరులో 25 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీకి వరద ప్రవాహం పెరిగింది. పైనుంచి వస్తున్న వరదతో జూలూరు -రుద్రవెల్లి లోలెవెల్ బ్రిడ్జి వద్ద మూసీ పరవళ్లు తొకుతున్నది.