హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు అర శాతం (0.5) రుణాలను అదనంగా పొందేందుకు కేంద్రం వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ చేసింది. 15వ ఆర్థిక సంఘం, కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ సిఫార్సులతో మార్కెట్ నుంచి అదనపు రుణాలు పొందేందుకు అనుమతిస్తున్నట్టు వెల్లడించింది.
2022-23కు సంబంధించి అదనపు రుణం తీసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్, అస్సాం, కేరళ, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమబెంగాల్‌కు అవకాశం కల్పించింది. ఈ రాష్ర్టాలు మొత్తంగా రూ.27,238 కోట్లు రుణంగా తీసుకొన్నాయి. విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా మూడేండ్లపాటు అదనపు రుణాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, 2021-22లో 12 రాష్ర్టాలు రూ.39,175 కోట్ల రుణాన్ని తీసుకున్నాయి. 2023-24లో రూ.1,43,332 కోట్లు తీసుకొనే అవకాశం ఉన్నది. 2021-22లో ఆంధ్రప్రదేశ్ రూ.3,716 కోట్ల అదనపు రుణం పొందగా, 2022-23లో రూ.5,858 కోట్లు పొందే అవకాశం దక్కింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నది. దీనిలో భాగంగా కేంద్రం సూచనలతో పలు రాష్ర్టాలు వ్యవసాయ మోటర్లకు మీటర్లు కూడా పెట్టాయి. అలాగే డిస్కంలను ప్రైవేటీకరించడానికీ సిద్ధమయ్యాయి. కేంద్రం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్తు రంగంలో సంస్కరణలను అమలు చేసిందుకు అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు 2022-23 కోసం ఆరు రాష్ర్టాలకు కేంద్రం అవకాశం కల్పించింది.