కరీంనగర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ)/ గంగాధర : రైతుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఆదివారం సాయంత్రం నుంచి అధికారులు వరద కాలువకు నీళ్లు వదులుతున్నారు. 0.1 టీఎంసీ నీటిని వదులుతున్నట్లు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించకపోవడం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా వరద కాలువ అడుగంటింది. కాలువలో క్రేన్లు బిగించి రైతులు కాలువలో గుంతలు తవ్వుకుని నీటిని పంటలకు తరలించే ప్రయత్నాలు చేశారు.
అయినా పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో అనేక సార్లు ఆందోళనకు దిగారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు అండగా నిలవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నీటిని విడుదల చేసింది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవే నీటిని వారం పది రోజుల ముందు ఇచ్చినట్లయితే ఈ ప్రాంతంలో పంటలు ఎండిపోయేవి కాదని రైతులు అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు ప్రారంభించారు. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు ఎత్తిపోయించారు. అక్కడి నుంచి 6వ బాహుబలి మోటర్ ద్వారా వరద కాలువలోకి ఎత్తిపోయిస్తున్నారు. వరద కాలువ ఎగువ ప్రాంతంలోని 122వ కిలో మీటర్ వద్ద గేట్లు మూయించడంతో అటు ఎస్సారెస్పీకి వెళ్లకుండా దిగువ ప్రాంతానికి నీటిని మళ్లించారు.
సోమవారం రామడుగు మండలం షానగర్ వద్ద గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతంలోని బోయినపల్లి మండలం వరదవెల్లి వరకు వరద కాలువలో నీళ్లు నిండుతున్నాయి. 0.1 టీఎంసీ నీటిని మాత్రమే విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఎంత వరకు ఉపయోగపడతాయనేది ప్రశ్నార్థకంగానే ఉన్నది.