సుల్తాన్‌బజార్, అక్టోబర్ 24: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే అర్చక, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యాయని తెలంగాణ దేవాదాయ అర్చక, ఉద్యోగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి పేర్కొన్నారు. ఆదివారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కార్యాలయ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో అర్చక, ఉద్యోగ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవాదాయశాఖ పరిధిలో 20 ఏండ్లుగా క్యాడర్ స్ట్రెంత్ నియామకం జరగక వందల మంది అర్చక, ఉద్యోగులు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు పొందలేదని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే అన్ని దేవాలయాలకు క్యాడర్ స్ట్రెంత్ ఏర్పాటు చేయడానికి సర్కులర్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌తోపాటు ఇందుకు సహకరించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, వివిధ దేవాలయాలకు భక్తుల రద్దీ దృష్ట్యా ఆదాయాన్ని అనుసరించి క్యాడర్ స్ట్రెంత్ ఫిక్సేషన్ కోసం ఈ నెల 29న అధికారులు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పరాశరం రవీంద్రాచారి, రాజేశ్వరశర్మ, పీ నాగరాజు శర్మ, బండారు జగపతి, సీహెచ్ బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.