సింగరేణిలో సైట్విజిట్, సోలార్ టెండర్లలో స్కాములను బీఆర్ఎస్ బయటపెట్టింది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయంపై ప్రశ్నించింది. అందుకే రేవంత్ సర్కార్ కక్షగట్టి బీఆర్ఎస్ నేతలపై కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నది. ఈ ఉడుత ఊపులకు భయపడ్తమా?
– కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో/సైదాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సింగరేణిలో జరుగుతున్న భారీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో ఒక్కో కుంభకోణం బయట పడుతున్నదని, 40లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును తీయకుండానే తీసినట్టు చూపించి రూ.1,600 కోట్ల రూపాయల గోల్మాల్ చేశారని ఆరోపించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న బాల్క సుమన్‌ను గురువారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. జైలు శిక్షలకు బీఆర్ఎస్ భయపడే ప్రసక్తే లేదని, సింగరేణి కార్మికుల పొట్టగొడుతున్న కాంగ్రెస్ సర్కార్‌ను గల్లా పట్టి నిలదీస్తామని హెచ్చరించారు.
సింగరేణిలో సైట్ విజిట్, సోలార్ టెండర్లు ఇలా ఒక్కో స్కామును బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతున్నది. 40 లక్షల టన్నుల బొగ్గు తీయకున్నా తీసినట్టు చూపి రూ.1,600 గోల్మాల్ చేసింది. అందుకే రేవంత్ సర్కార్ మా నాయకులపై కక్ష గట్టిండు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వెలుగుచూస్తున్న కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు అరెస్టు చేస్తున్నది. జైళ్లు, బెదిరింపులకు భయపడం. సర్కార్‌ను గల్లా పట్టి నిలదీసి, దోపిడీని అడ్డుకుంటం.
– కేటీఆర్
సింగరేణిలో బొగ్గు కుంభకోణాలను బీఆర్ఎస్ బయటపెడుతున్నందుకే రేవంత్ సర్కార్ తమ నాయకులపై కక్ష గట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డి కనుసన్నల్లోనే ఈ స్కాములన్నీ జరుగుతున్నాయని.. సైట్ విజిట్ సర్టిఫికెట్, సోలార్ టెండర్లలో కుంభకోణాలను బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చిందని చెప్పారు. సింగరేణి అక్రమాలు, అన్యాయాలను వదలిపెట్టబోమని, ప్ర శ్నిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. నైని కోల్ టెండర్ వ్యవహారంలో ముఖ్యమంత్రి, మంత్రులకు వాటాలు కుదరకపోవటం వల్లే విషయం జర్నలిస్టులను అరెస్ట్ చేసేదాకా వెళ్లిందని విమర్శించారు. టీబీజీకేఎస్ సమావేశంలో కార్మికుల ఆవేదనను అర్థం చేసుకొని బాల్క సుమన్ మాట్లాడితే.. అసలు విషయం బయటకు రాకుండా అక్రమ కేసులు బనాయించి జైలు పెట్టారని మండిపడ్డారు. బాల్క సుమన్‌పై పెట్టిన కేసులోని సెక్షన్లను చూసి మెజిస్ట్రేట్ కూడా వారి చర్యలపై మందలించారని కేటీఆర్ గుర్తుచేశారు.
కాంగ్రెసోళ్లకో నీతి.. బీఆర్ఎస్ నాయకులకు ఒక నీతా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేసిన వారిపై కేసులు పెట్టారా, హరీశ్‌రావును పెట్రోల్ పోసి తగులబెడ్తా అని బెదిరించిన కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు శిక్షార్హుడు కాదా అని నిలదీశారు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్థానికంగా ఉన్న ఒక కంపెనీపై పెట్రోల్ పోసి కాల్చేస్తానంటే అక్కడ శిక్షలు, కేసులు, సెక్షన్లు ఉండవా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరి బాల్క సుమన్‌పై ఎందుకు మీకంత ద్వేషం, ఇప్పటికే ఉద్యమంలో ఆయనపై 220 కేసులు పెట్టారని, రికార్డులను బద్దలు కొట్టేలా కేసులు పెడుతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రగతిభవన్‌ను పేల్చినా తప్పులేదని నాడు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా, పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి మాట్లాడిండు. ఆయన శిక్షకు, చంచల్‌గూడ జైలుకు రావడానికి అర్హుడు కాదా? బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్నడు.. ఆయన శిక్షార్హుడు కాదా? హరీశ్‌రావుపై పెట్రోల్ పోసి తగులబెడ్తా అని మైనంపల్లి మాట్లాడిండు. బాల్క సుమన్‌పై నమోదు చేసిన కేసులు, సెక్షన్లు వీళ్లకు వర్తించవా?
– కేటీఆర్
సింగరేణిలో జరుగుతున్న అన్యాయాలపై టీబీజీకేఎస్ సమావేశంలో బాల్క సుమన్ కార్మికుల పక్షాన గళమెత్తారని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో మెడికల్ ఇన్వ్యాలిడేషన్ ద్వారా 19వేల ఉద్యోగాలు ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిన 11నెలలుగా బోర్డు మీటింగ్‌లు పెట్టకుండా వేలాది మంది కార్మిక బిడ్డలకు అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. పైగా గతంలో ఇచ్చిన ఉద్యోగాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించి కార్మికుల్లో కలవరం రేపారని మండిపడ్డారు. బొగ్గు స్కామ్ దోపిడీ ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ఈ స్కామ్‌పై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి శుక్రవారం సమగ్రంగా లేఖ రాస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
బాల్క సుమన్ ఎంతో ధైర్యంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ‘నా గురించి ఎవరూ బాధపడొద్దు, జైళ్లు, కేసులు కొత్త కాదు.. ఉద్యమ కాలం లోనే నాపై 220 కేసులు పెట్టారు.. మంచిర్యాల, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు తీవ్ర ఆక్రోశంలో ఉన్నారు. నాకంటే వారి సమస్యల మీదే దృష్టి పెట్టండి. వారి కోసం పోరాడండి’ అని సుమన్ తమతో చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. నిజం నిగ్గుతేలే వరకు సుమన్‌ను మరో వారం కాదు కదా నెల రోజులు జైల్లో ఉంచినా బీఆర్ఎస్ భయపడదని, కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలను, సింగరేణి దోపిడీని వీధిన పడేసే వరకు విశ్రమించేంది లేదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు పల్లె రవికుమార్, యాకుత్‌పురా, మలక్‌పేట నియోజకవర్గాల ఇన్చార్జులు సామ సుందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఎన్ రాజు, పగిళ్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.