మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. అసలే చతికిలబడిన రియల్ఎస్టేట్ రంగంపై ధరల పిడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్ల చార్జీలు పెరుగనున్నాయి. అదనపు రాబడే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూములు, అపార్మెంట్ ఫ్లాట్ల ధరలు పెరుగనున్నాయి. ఇప్పటికే కుదేలైన రియల్ఎస్టేట్ రంగానికి కోలుకోలేని దెబ్బ పడనున్నది.
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచే పెంచిన భూముల ధరలు అమల్లోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పూర్తి చేసింది. కార్డుల్లో కొత్త ధరల వివరాలను నమోదు చేసింది. కొత్త వివరాల నమోదుకు గురువారం సాయంత్రం నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ పనిచేయడంలేదు.
భూముల ధరల పెంపు ద్వారా ప్రజల జేబులను గుల్ల చేసి.. సర్కార్ తన ఖజానాను నింపుకోనున్నది. భూముల ధరల పెంపుతో ఏటా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం చెప్తున్నది. అయితే, రూ.4వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా ధరలు పెంచినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 98 వేల ప్రాంతాల్లో భూముల ధరలను సవరించినట్టు తెలిసింది.
కొన్ని ప్రాంతాల్లోనే పెంచినట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, దాదాపు రాష్ట్రమంతా పెంచినట్టు సమాచారం. మెజారిటీ ప్రాంతాల్లో ఈ పెంపుదల 80శాతానికిపైగా ఉన్నదని తెలిసింది. ప్రాంతాలు, భూముల ధరలను బట్టి ప్రస్తుత ధరలపై 50% నుంచి 100% ధరలు పెంచినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రైమ్ ఏరియాల్లో 100% పెంచినట్టు వెల్లడించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇది 300 శాతానికిపైగా ఉన్నదని సమాచారం. ఎలాంటి శాస్త్రీయత లేకుండా భారీ ఆదాయమే లక్ష్యంగా ఇష్టానుసారం భూముల విలువలను పెంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పెంపుతో ప్రజలకు రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగనున్నది. రిజిస్ట్రేషన్ చార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నది.
సర్కార్ నిర్ణయంతో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు భారీగా పెరుగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమి విలువను కనిష్ఠంగా రూ.2.75 లక్షలుగా నిర్ణయించారు. మున్సిపాలిటీల్లో రూ.5 లక్షలు, హెచ్ఎండీఏలో రూ.10 లక్షలు, ఓఆర్ఆర్ పరిధిలో రూ.15 లక్షలుగా నిర్ణయించారు. ఓపెన్ ప్లాట్ల ధరలు సైతం భారీగా పెరుగనున్నాయి. ప్రస్తుత ధరలపై 100% పెరిగే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది.
ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో గజం ధర కనిష్ఠంగా రూ.5వేలుగా నిర్ణయించినట్టు సమాచారం. దీంతోపాటు అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలను కనిష్ఠంగా రూ.2 వేల నుంచి రూ.8వేల వరకు పెంచినట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకొని, చలాన్లు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తికాని వారికి సైతం కొత్త ధరలు అమలవుతాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టంచేసింది. అలాంటి వారు ధరల పెంపునకు అనుగుణంగా మిగిలిన అదనపు రుసుమును చెల్లించాల్సిందేనని, అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నది.
భూములకు ప్రస్తుతం ఉన్న ధరలతో పోల్చితే ప్రాంతాన్ని బట్టి 50% నుంచి 100% పెంచినట్టు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తద్వారా సర్కార్‌కు రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. మంత్రివర్గంలో శాఖల మార్పుపై స్పందిస్తూ.. తనకు ఏ శాఖ ఇచ్చినా పని చేస్తానని స్పష్టంచేశారు.
రెవెన్యూలో అవినీతి లేకుండా చేస్తున్నానని, అందుకే ఏసీబీ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాను మంత్రిగా వచ్చిన తర్వాత ఏసీబీ కేసులకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేశానని చెప్పారు. అసైన్డ్ భూములకు సంబంధించి కొత్త పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. త్వరలో తహసీల్దార్ల బదిలీలు ఉంటాయని పేర్కొన్నారు.
సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లో కోత పెడుతామని చెప్పారు. తాను ఏ ఫైల్‌పై కూడా గుడ్డిగా సంతకం పెట్టలేదని, తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ… ఫ్యూచర్ సిటీని రద్దుచేయడం సాధ్యంకాదని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో లాండ్స్ ఫ్రీగా ఇవ్వడం లేదని, రద్దు చేస్తే ప్రభుత్వం డబ్బు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని, ఇది సాధ్యమయ్యే పనికాదని వ్యాఖ్యానించారు.
గ్రామాల్లో 2.75 లక్షలు
మున్సిపాలిటీల్లో 5 లక్షలు
హెచ్ఎండీఏలో 10 లక్షలు
ఓఆర్ఆర్ పరిధిలో 15 లక్షలు