
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): శుభం పలుకరా పెండ్లి కొడకా అంటే.. పెండ్లికూతురు.. ఎక్కడ సచ్చింది అన్నాడట వెనకట ఒకడు. తెలంగాణలో విపక్షాల పోకడ అచ్చంగా ఇలాగే ఉన్నది. ప్రజలకు మేలు చేసే పని ఒకదాన్ని ప్రభుత్వం చేపడితే.. అది సక్రమంగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఏదైనా లోపాలుంటే సలహాలివ్వటం నిర్మాణాత్మక ప్రతిపక్షం పని. తెలంగాణలోని ప్రతిపక్షాలకు ఈ సోయి ఎంతమాత్రం లేకుండాపోయింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మస్తిష్కంలోనుంచి ఏ ఒక్క పథకం ఆవిర్భవించినా.. దాని అమలుకు ముందే పిల్లిశాపాలు పెట్టడం రివాజుగా మారింది. మొదట ఇది సాధ్యం కాదంటారు. వాళ్లు అసాధ్యమని అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపిస్తే.. మరిన్ని వంకలు పెడతారు. కోర్టుల్లో కేసులు వేస్తారు.. కేంద్రానికి ఫిర్యాదులు చేస్తారు. రంధ్రాన్వేషణ మొదలుపెడతారు. అక్కడా ఇక్కడా కాకపోతే.. పార్లమెంటుకు పోయి దేశమంతా విస్తుపోయేలా వెర్రిమొర్రి ప్రశ్నలు వేసి తెల్లమొహాలేసుకొని తిరిగివస్తారు. ముఖ్యమంత్రి ప్రజల మేలెంచుతారు. విపక్షాలు కీడెంచుతున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ విపక్ష నేతలవి ఇవే పోకడలు.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా నుంచి తాజాగా నేటి దళితబంధు దాకా కుట్రపూరితంగా వాటిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకొన్నారు. ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేసినప్పుడు దానిలోని మంచిచెడ్డలు, లోటుపాట్ల గురించి నామమాత్రంగానైనా చర్చించకుండా గుడ్డిగా వ్యతిరేకించడం.. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవడం.. తెలంగాణలోని విపక్షాలకే చెల్లింది. ముఖ్యమంత్రి మస్తిష్కంలోనుంచి అవతరించిన ఒక్కొక్క పథకం వివిధ రాష్ర్టాలకు.. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే అమలుచేసేవిధంగా ఆదర్శవంతంగా మారుతుంటే.. మన దగ్గర కండ్లున్న కబోదులకు మాత్రం మెచ్చుకోకపోయినా పర్వాలేదు.. అడ్డుపుల్లలు వేయకుండా ఉండే సహృదయం లేకుండాపోయింది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్యమనేత. తెలంగాణలో అణువణువూ అవపోశన పట్టినవారు. పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్థానంలో గడపగడపనూ తరచి చూసినవారు కాబట్టే.. ఆయనకు భవిష్యత్ తెలంగాణపై ఒక స్పష్టమైన దార్శనికత ఉన్నది. ఏ వర్గానికి ఏమి చేస్తే ప్రయోజనం కలుగుతుందో విస్పష్టమైన ఆలోచన ఉన్నది. ప్రజాసంక్షేమం చేయడానికి ఆయనకు ఎన్నికల రాజకీయాలతో నిమిత్తం లేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు కొన్నే ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో వర్గానికి ఒక్కో పథకం ద్వారా మేలు చేసుకొంటూ పోతున్నారు. వీటిలో చాలావరకు ఎన్నికల సందర్భంగా ఇచ్చినవి కావు. సీఎం కేసీఆర్ ఒకసారి హామీ ఇచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకకు పోవడం ఉండదు. ప్రభుత్వ ప్రాధాన్యాలను బట్టి.. ఆర్థిక వెసులుబాటును బట్టి ఎప్పటికప్పుడు అమలుచేసుకొంటూ వెళ్తున్నారు. ‘కేసీఆర్‌ది మొండిపట్టు. ఒక్కసారి చెప్పిండంటే ఆరు నూరైనా అమలు జరిగి తీరుతది. ఎనుకకు పోవుడే ఉండది’ సీఎం కేసీఆర్ తరుచూ చేసే వ్యాఖ్య ఇది. గత ఏడేండ్లుగా ప్రజా సంక్షేమమే పరమావధిగా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాల చిల్లర రాజకీయాలను, విమర్శలను పట్టించుకోకుండా, వాళ్లు చేసే కుట్రలు, కుతంత్రాలను పటాపంచలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేలా కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తించి, వారి సామాజిక పరిస్థితిని అర్థం చేసుకొని, ప్రతి ఒక్కరూ గౌరవంగా బతుకాలనే గొప్ప లక్ష్యంతో ఎన్నికల హామీలకు అతీతంగా అనేక పథకాలను ప్రవేశపెట్టారు. విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు దేశంలోనే ఎవరూ చేయడానికి సాహసించని.. దళితబంధు పథకాన్ని ప్రారంభిస్తే దానిపైనా విషం చిమ్ముతున్నారు. ఒకవైపు దళితులపై మొసలి కన్నీరు కారుస్తూనే వారిపై ఇతర వర్గాలను రెచ్చగొడదామని చూస్తున్నారు. ఈ ప్రతిపక్షాలు ఇంతగా కుప్పిగంతులేస్తున్నాయి. కానీ, వారు పాలిస్తున్న రాష్ర్టాలలో ఇటువంటి గొప్ప కార్యాలు తలపెట్టడం లేదు. ఇక్కడ వారికి అధికారమే లేదు. ఉద్ధరించేదేమీ లేదు. అయినా సభలు, గిభలు ఎందుకు పెడుతున్నట్టు.. ‘ఔరోంకో షాదీమే అబ్దుల్లా దివానా’ అన్నట్టుగా ఉన్నది. వీరికి జనంమీద ప్రేమ లేదు. ఖలునకు నిలువెల్లా విషమన్నట్టుగా ఉన్నది.,
