హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రజా వ్యతిరేక మనువాదపార్టీ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటే ఆ పార్టీ నేతలకు గిట్టదని ఆరోపించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో ఈ వర్గాలపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేశ్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గోద్రా అల్లర్లతో అణగారిన వర్గాలను ఊచకోత కోశారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు శ్రీవాస్తవను చంపిన దుష్ట చరిత్ర బీజేపీది అని విమర్శించారు. బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని, దళితబంధును నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కండ్లు ఉండి కూడా కబోదిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడుతున్న సంజయ్‌ను ప్రజలు ఛీ కొడుతున్నారని వెల్లడించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, మొత్తం కలిపి 175 అడుగుల ఎత్తు లో ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఇప్పటికే 40 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరి నాటికి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. ఇక్కడ అంబేద్కర్ స్మృతికేంద్రాన్ని గొప్పగా ఏర్పాటు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. మ్యూజియం, గ్రంథాలయం, సమావేశ మందిరాలు, ఫొటో గ్యాలరీ, క్యాంటీన్, అతిథుల కోసం గదులు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నది బీజేపీయే
రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానులేనని, బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ దాన్ని గౌరవించకుండా తూట్లు పొడుస్తున్నదని కొప్పుల ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకొన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల సీఎం కేసీఆర్, టీఆర్ఎస్కు ఎనలేని గౌరవం ఉన్నదని స్పష్టం చేశారు. దేశంలో పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగానికి సవరణలు చేసుకోవచ్చని అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. అటు.. పాలనా సౌలభ్యం కోసమే సౌకర్యవంతమైన సచివాలయ నిర్మాణం జరుగుతున్నదని మంత్రి చెప్పారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎంపీ రవికిశోర్ దళితుడి ఇంట్లో భోజనం చేసి, బయటకు వచ్చి చేసిన తప్పుడు వ్యాఖ్యల వీడియోను వెంకటేశ్ నేతకాని మీడియాకు చూపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ దూషించారని గుర్తుచేశారు. 125 అడుగుల అంబేదర్ విగ్రహం నెలకొల్పుతున్న ఈ స్థలం పవిత్రమైనదని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. ఇలాంటి పవిత్ర స్థలంలో అడుగుపెట్టే కనీస అర్హత మనువాద పార్టీ బీజేపీకి, బండి సంజయ్‌కు లేదని.. అందుకే పలువురు అంబేదర్ వాదులు పాలతో ఈ ప్రాంతాన్ని శుద్ధి చేశారని వెల్లడించారు. దళితులపై ప్రేమ ఉంటే దేశమంతటా దళితబంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పాలతో అంబేదర్ ప్రాంగణం శుద్ధి
బండి సంజయ్ రాకతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్న ప్రాంగణం మలినమైనదని టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ విద్యార్ధి సంఘం నాయకులు ఆ ప్రాంతాన్ని పాలతో శుద్ధిచేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు, రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేశ్ మాట్లాడుతూ దళితులకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని బండి సంజయ్‌ను డిమాండ్ చేశారు. దమ్ముంటే గిరిజన యూనివర్సిటీ తెచ్చాకే మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారా? అని నిలదీశారు. దేశంలో అనేక చోట్ల దాడులు జరుగుతున్నా ఏనాడూ స్పందించని బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నేతలు పాల్గొన్నారు.