Heavy Rains | హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వర్షాభావ పరిస్థితులతో మొన్నటి వరకు సాగు పనులు నెమ్మదించాయి. కొంత ఆలస్యమైనా సమృద్ధిగా వానలు పడుతుండటంతో సాగుపనులు మళ్లీ ఊపందుకున్నాయి. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 69 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. వరి, పత్తి సాగు పరుగులు తీస్తున్నది. ఇప్పటి వరకు పత్తి 40.73 లక్షల ఎకరాల్లో సాగు అయింది. 15.63 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. సోయాబీన్ 4.14 లక్షల ఎకరాల్లో, కంది 3.82 లక్షల ఎకరాల్లో, మక్కజొన్న 3.62 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక జిల్లాలవారీగా పంటల సాగును పరిశీలిస్తే 6.83 లక్షల ఎకరాలతో నల్లగొండ జిల్లా టాప్లో నిలువగా, 5.65 లక్షల ఎకరాలతో ఆదిలాబాద్ జిల్లా రెండో స్థానంలో దక్కించుకున్నది. సంగారెడ్డి జిల్లాలో 4.69 లక్షల ఎకరాల్లో, వికారాబాద్ జిల్లాలో 4.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
గత ఏడాది సాగుతో పోటీ
గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో రికార్డుస్థాయిలో 1.36 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్ కూడా గత వానకాలం సాగుతో పోటీ పడుతున్నది. నిరుడు ఈ సమయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 68.90 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఇప్పుడు దాదాపు 68.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి వరి 11.11 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ సీజన్లో 15.63 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే ఇప్పటికే 4.52 లక్షల ఎకరాల్లో అధికంగా వరి సాగు కావడం విశేషం. పత్తి కూడా గతేడాది ఈ సమయానికి 44.53 లక్షల ఎకరాల్లో సాగైతే ప్రస్తుతం ఇది 40.73 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లోనూ సాగుకు ఢోకా లేదని, రికార్డుస్థాయిలో సాగు కావడం ఖాయమని అధికారులు తెలిపారు.
పంటల సాగు వివరాలు ఇలా..