నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 9 : యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల వద్ద రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. అక్కడే టిఫిన్ బాక్సులు తెచ్చుకుని భోజనాలు చేస్తున్నారు. మంచాలు తెచ్చుకుని నిద్రిస్తున్నారు. ఇంటిల్లిపాదీ పడిగాపులు కాచినా ఒక్క యూరియా బస్తా కూడా దొరక్కపోవడంతో ప్రధాన రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. వీరికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. యూరియా ఇవ్వడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని చోట్ల మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు. తమ పంటలకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా చేర్యాల జాతీయ రహదారిపై మండల రైతులు రాస్తోరోకో నిర్వహించారు. గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతులు ప్రభుత్వానికి, వ్యవసాశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ శ్రీను, ఎస్ఐ నవీన్ చేరుకుని వారిని శాంతింపజేసేందుకు యత్నించినప్పటికీ ధర్నా విరమించలేదు. ఏడీఏ రాధిక రైతులకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు శాంతించారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారిపై మంగళవారం యూరియా కోసం రాస్తారోకో చేస్తున్న మండలంలోని రైతులు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి పీఏసీఎస్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు
కరీంనగర్ జిల్లా వెదిరలో రైతులతో కలిసి రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సొసైటీ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు
భద్రాద్రి జిల్లా నారాయణపురం సొసైటీ వద్ద సొమ్మసిల్లి పడిపోయిన జెట్టివారిగూడెంకు చెందిన రైతు జెట్టి సింగరాజు