హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్ కాలేజీల్లో విద్యార్థులు ఒక మీటర్ భౌతికదూరాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులు ఆదేశించారు. కాలేజీకి రెండు చొప్పున ఐసొలేషన్ గదులను అందుబాటులో ఉంచాలని, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని వెంటనే పీహెచ్‌సీలకు తరలించి చికిత్సనందించాలని సూచించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంటర్ కాలేజీల్లో సైతం ప్రత్యక్ష తరగతులు ప్రారంభంకానున్న దృష్ట్యా ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం మార్గదర్శకాలను విడుదల చేశారు. వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బంది, అధ్యాపకులు మాత్రమే విధులకు హాజరుకావాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. గెస్ట్ ఫ్యాకల్టీ మినహా అంతా గురువారం నుంచే విధులకు రావాలని ప్రకటించిన ఆయన.. విద్యార్థులు మాత్రం సెప్టెంబర్ ఒకటి నుంచి తరగతులకు హాజరుకావాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు అప్రమత్తంగా ఉండి కాలేజీల ప్రారంభానికి, తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.
మార్గదర్శకాలివే..
ఈ నెల 30లోగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలతో సమన్వయం చేసుకొని, కాలేజీల్లో శానిటైజేషన్ చేయించాలి. పరిశుభ్రం చేయించినట్టుగా క్లీనింగ్ సర్టిఫికెట్‌ను అదేరోజు డీఐఈవో, నోడల్ అధికారులతోపాటు ఇంటర్ విద్య ప్రధాన కార్యాలయానికి పంపాలి కళాశాల గదులు, తరగతి గదుల్లోని ఫర్నీచర్, ప్రాంగణాన్ని ప్రతిరోజూ శానిటైజేషన్, పరిశుభ్రం చేయించాలి. ఖాళీ మైదానాన్ని సైతం ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి.
సిబ్బంది, అధ్యాపకులంతా తప్పనిసరిగా మాస్క్‌లను ధరించే విధులకు హాజరవ్వాలి.థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే విద్యార్థులను కళాశాలలోకి అనుమతించాలి. ఎవరైనా విద్యార్థి దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలంటే పీహెచ్‌సీకి పంపించాలి.
n ముగ్గురు అంతకంటే ఎక్కువ విద్యార్థులు, వ్యక్తులు గూమిగూడరాదన్న నిబంధనను కఠినంగా అమలుచేయాలి.