
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గుజరాత్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తాము హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన తర్వాత.. శిఖండిలా మరో ఐఏఎంసీని ప్రతిపాదించారన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
కురచబుద్ధి మోదీ
దేశ ప్రధాన మంత్రి చాలా కురచబుద్ధి ఉన్న వ్యక్తి. నేను ఎంతో బాధతో ఈ మాట చెప్తున్నా. భారతదేశంలో పరిశ్రమలు పెరిగాయి. వేలు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. తెలివికల్ల రాష్ర్టాలకు మరింత ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ పరిశ్రమలు పెరుగుతున్నాయి. మంచి పాలసీలు ఉన్న దగ్గర అద్భుతమైన పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థల మధ్య, సంస్థల పెట్టుబడిదారుల మధ్య గొడవలు జరుగుతాయి. వాటిని కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దానికి ఆధునిక ప్రపంచం అవలంబిస్తున్న పద్ధతి.. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం. అంటే కోర్టు బయట పంచాయతీలు తెంపుకొనుడు. దాంట్లోంచి పుట్టుకొచ్చిందే లోకాయుక్త.. ఆర్బిట్రేషన్ సెంటర్లు కూడా అలాంటివే. అవి మన దేశంలో లేవు. మొదటినుంచి లండన్లో ఉన్నది. ఈ మధ్య సింగపూర్, దుబాయ్లో కూడా పెట్టారు. జెనీవాలో కూడా ఉన్నట్టుంది. మన ఇండియాలో లేదు. మనోళ్లు కూడా పంచాయతీ తెంపుకోవాలంటే అక్కడికి వెళతారు. ఎవరో నాకు చెప్తే నేను మన సుప్రీంకోర్టు సీజేఐ రమణగారిని ప్రార్థించాను. హైదరాబాద్ అంతర్జాతీయ సిటీ, మంచి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టండి.. మేం అన్ని విధాల సహకరిస్తాం అని అడిగాం. ఆయన కూడా ‘నేను కూడా ఇక్కడే పెరిగిన వాణ్ణి, నాకు కూడా ప్రేమ ఉన్నది.
హైదరాబాద్ నగరానికి ఆ అర్హత కూడా ఉన్నది. మీ ప్రభుత్వం కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది’ అని రమణగారు చెప్పారు. హైదరాబాద్ ప్రొఫైల్ పెంచాలన్న ఉద్దేశంతో మేం ఈ సెంటర్ను ఇక్కడ పెట్టాలనుకున్నాం. ఇప్పటికే మన నగరంలో ఐటీ పరిశ్రమ ఉన్నది. ఇండస్ట్రీలున్నాయి. కొంత ఖర్చు అయినా సరే ముందుకు వచ్చాం. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల పనితీరు గమనించి, వాటి స్థాయికి తగ్గకుండా ఉండేలా ఇక్కడ సెంటర్ పెట్టాం. ప్రస్తుతానికి ఒక చోట కిరాయికి తీసుకొని ప్రారంభించాం. రూ.15 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం. దీని నిర్వహణకు ఏటా ప్రభుత్వం గ్రాంటు కింద నుంచి రూ.3 కోట్లు ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చాం. ఏడాదికి కోటి 60 లక్షల రూపాయల కిరాయి కడుతున్నాం. శాశ్వత భవనానికి ఎకరానికి రూ.100 కోట్ల విలువ చేసే మూడెకరాల జాగ కూడా కేటాయించాం. రూ.50 కోట్లతో బిల్డింగ్ కూడా కట్టబోతున్నాం. ఈ నెల 5న ప్రధాన న్యాయమూర్తి గారు ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తామన్నారు. ప్రధానమంత్రి ‘అహ్మదాబాద్లో పెట్టాలి కదా. హైదరాబాద్లో ఈ సెంటర్ ఎందుకు’ అని వాళ్లపైన ఒత్తిడి కూడా చేశారు. అయినా సరే ఇప్పటికే మాట ఇచ్చినం.. ప్రకటించాం కాబట్టి అని వారు హైదరాబాద్లోనే స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మోదీకి నిద్రపట్టడం లేదు. ఆయన దేశానికి కాదు.. గుజరాత్కే ప్రధాన మంత్రి.. ఈ మాట నేను చాలా బాధతో చెప్తున్నా. మనసుకాలి చెప్తున్నా. దీనికి ఒక శిఖండిని పెడ్తం అని ఈ రోజు బడ్జెట్లో ప్రకటించిండ్రు’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్ మేధావులు ఆలోచించాలె
ఇక్కడ బతికినవ్ (నిర్మలాసీతారామన్), ఈ గడ్డ నీళ్లు తాగినవు. తెలుగువారి కోడలంటవు. నీవు ఆత్మద్రోహం చేసుకున్నవ్ కదా ఇవాళ. మన హైదరాబాద్ యెక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టిండు ఇవాళ మోదీగారు. శాంతిపర్వం శ్లోకం చెప్పినవే.. నీ ఆత్మ ఘోషించలేదా? ధర్మం గురించి చెప్తూ ఇంత అధర్మమా? హైదరాబాద్ యువకుల్లారా, హైదరాబాద్ మేధావుల్లారా మీరు ఆలోచన చేయాలె. ఈ బీజేపీ నీతి ఏంది? ఇది అన్యాయం కాదా. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థికశాఖ మంత్రికి మ్యాగ్నానిమిటీ ఉంటే హైదరాబాద్ సెంటర్ని పొగిడి ఉండాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి ఉండాలి. మన దేశంలో ఇంతకుముందు లేకుండె, తెలంగాణ ప్రభుత్వం ఇన్నికోట్లు ఖర్చుపెట్టి ముందుకు పోతున్నది, వసతులు ఏర్పాటుచేసి ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. ఈ సెంటర్కి రూ.100 కోట్లు ఇస్తున్నం. ఇంకోటి గుజరాత్లో కూడా పెడుతున్నం అంటే బావుండేది. ఒక శిఖండిని పెడుతున్నం అని ఇవాళ చెప్తున్నరు. ఇంతకన్న సిగ్గుచేటు ఇంకోటి ఉంటదా? హైదరాబాద్ జర్నలిస్టులుగా, తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా? ఇంత కురచబుద్ధి ప్రధానమంత్రా ఈ దేశానికి? ఇటువంటి సంకుచితమైన కేంద్రాన్ని కలిగివున్నందుకు చాలా సిగ్గుపడుతున్నం.