తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అనేక విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ పేద, బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేశారు. దేశానికి కొత్తదారి చూపారు. సంక్షేమ రంగంలో వినూత్న సంస్కరణలకు నాందిపలికారు. పదేండ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా, గతంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, అనాథలు, లింగమార్పిడీ వ్యక్తులు ఇలా సమాజంలోని ప్రతి వర్గానికీ ఏదో ఒక లబ్ధి చేకూర్చేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలు చేయడం విశేషం.
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లోనూ నూతన ఆవిష్కరణలకు చిరునామాగా తెలంగాణను మార్చారనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, గురుకుల విద్యాలయాలు, ఉచిత విద్యుత్తు, గొర్లు, చేపల పంపిణీ, దళితబంధు, గృహలక్ష్మీ, బీసీ బంధు, మైనార్టీ బంధు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉదాహరణగా నిలుస్తాయి. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రత్యక్షంగా ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చడంతోపా టు, పరోక్షంగా రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డాయి. బాల్య వివాహాలు, మాతా శిశు మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో మాంసం, చేపల ఉత్పత్తి పెరిగింది. పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గాయి. ఉన్నత చదువులు చదివే బాలికల సంఖ్య పెరిగింది. భూగర్భజలాలు పెరిగాయి. ఈ విప్లవాత్మక మార్పులన్నీ కేసీఆర్ పథకాల ఫలితాలకు తార్కాణాలుగా నిలిచాయి. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలు యావత్ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి పలు పథకాలను అమలు చేయడం విశేషం.
వినూత్న పథకాలకు, సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన తెలంగాణలో ప్రస్తుత రేవంత్ పాలనలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఆరు గ్యారెంటీలని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. ఫ్రీ బస్సు మినహా ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ఇదిలా ఉంటే గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తూ వస్తున్నది. కొన్ని పథకాలను పేరుకు అమలు చేసినా అందులోనూ కోతలు విధిస్తున్నది. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, దళితబంధు, బీసీబంధు, మైనారిటీ బంధు, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, చేనేతమిత్ర, కంటివెలుగు తదితర స్కీమ్‌లన్నింటినీ రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది. కల్యాణలక్ష్మీ, విదేశీ విద్యానిధి, ఉచిత విద్యుత్తు తదితర పథకాలకు నిధుల విడుదల నిలిపివేసింది. కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చిన దాఖలా లేదు. స్వయం ఉపాధి పథకాలు లేవు. ఆరుగ్యారెంటీలు కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో తెలంగాణలోని సబ్బండవర్గాల సంక్షేమం ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయింది.
బీఆర్ఎస్ అమలు చేస్తున్న పలు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే కొనసాగిస్తున్నది. ఆయా పథకాలకు సంబంధించిన నిధులను కూడా సక్రమంగా విడుదల చేయడం లేదు. కల్యాణలక్ష్మీ పథకానికి సంబంధించిన చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొన్నది. ప్రమాదవశాత్తు మరణించిన గీతకార్మికులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియా నిధులను నెలల తరబడి విడుదల చేయడం లేదు. రజకులు, నాయీబ్రాహ్మణులకు సంబంధించి 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.10 వేల కోట్లు పేరుకుపోయాయి. ప్రభుత్వం హామీలు ఇవ్వడం తప్ప గడిచిన 24 నెలలుగా రూపాయి విదల్చలేదు. దీంతో కోర్సులు పూర్తి చేసుకున్నా విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బీసీ ఓవర్సీస్ బకాయిలను కూడా సకాలంలో చెల్లించడం లేదు. 2025 స్పింగ్, ఫాల్ సీజన్లకు సంబంధించి ఎంపిక ప్రక్రియనూ పూర్తి చేయలేదు. దీంతో పథకానికి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య తగ్గిపోతున్నదని అధికారులే వెల్లడిస్తున్నారు. బీసీ స్టడీ సెంటర్లకు నిధులు విదల్చడం లేదు. ఆయా సర్కిళ్లలో పోటీపరీక్షలకు సంబంధించిన శిక్షణ నత్తనడకన కొనసాగుతున్నది. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు మెస్ బిల్లుల చెల్లింపు, అద్దె చెల్లింపు పూర్తిగా గాడి తప్పిపోయింది.
చేనేత కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తొలుత బతుకమ్మ చీరల ఆర్డర్లను ఇస్తూ చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచింది. అటు తర్వాత థ్రిఫ్ట్ తదితర పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా అండగా నిలిచింది. వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టి యజమానులుగా తీర్చిదిద్దింది. రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా కల్పించింది. మగ్గాల ఆధునికీకరణ చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పథకాలకు పూర్తిగా మొండిచెయ్యే చూపింది. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడం లేదు. యూనిఫామ్ దుస్తుల టెండర్లను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నది.
అంధత్వ రహిత తెలంగాణ నినాదంతో కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ కంటిపరీక్షలు నిర్వహించడంతోపాటు, అవసరమైన వారికి కండ్లద్దాలు పంపిణీ చేసింది. పథకం ద్వారా దాదాపు 1,93, 81,127 మందికి పరీక్షలు నిర్వహించింది. కాంగ్రెస్ ఈ పథకాన్ని అటకెక్కించింది.
పల్లెలు, పట్టణాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దడంతోపాటు మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా 2019లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. ఏటా డంప్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం, చెత్తసేకరణ, పారిశుధ్య కార్యక్రమాలు, హరితహారం వంటివి క్రమం తప్పకుండా అమలు చేసింది. ఈ కార్యక్రమాలు 80శాతానికి పైగా లక్ష్యాన్ని సాధించాయి. కానీ కాంగ్రెస్ ఈ రెండు స్కీమ్‌లను పక్కనపెట్టింది. పంచాయతీలకు డబ్బులివ్వడం లేదు. మున్సిపాలిటీల్లో కనీసం చెత్త ఊడ్చే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్న దుస్థితి. హరితహారం చెట్లు, పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతుండగా, యువకుల కోసం పెట్టిన క్రీడా ప్రాంగణాల్లో చెట్లు మొలుస్తున్న దుస్థితి నెలకొన్నది. ఇటీవల 99రోజుల ప్రణాళికకు కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపునిచ్చినా పల్లెలు, పట్టణాల అభివృద్ధికి రూపాయి విదల్చలేదు.
రైతులకు వానకాలం, యాసంగి పంటల సాగుకు రూ.10వేల పెట్టుబడి అందివ్వడం కోసం 2018లో అప్పటి కేసీఆర్ సర్కార్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారుల సంఖ్య 50.25 లక్షల మందితో మొదలై 65 లక్షలకు చేరుకున్నది. రైతుల మరణాలు తగ్గుముఖం పట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అరకొరగానే అమలు చేస్తున్నది. పెట్టుబడి సాయం ఎప్పుడు వేస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాయీబ్రాహ్మణుల సెలూన్లు, రజకుల ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. తద్వారా 1,07,352 మంది రజక, నాయీబ్రాహ్మణులకు లబ్ధి చేకూరింది. అయితే, ఈ స్కీమ్‌కు సంబంధించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.250 కోట్లను పెండింగ్ పెట్టింది.
మాతాశిశు మరణాల సంఖ్యను తగ్గించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య పెంచడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం 2017లో కేసీఆర్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవిస్తే మగబిడ్డకు రూ.12 వేలు, ఆడబిడ్డకు 13 వేల ప్రోత్సాహకంతోపాటు, శిశువులకు కావాల్సిన వస్తువుల కిట్లను అందించింది. 2023 చివరి నాటికి దాదాపు 13,29,951 మందికి లబ్ధి చేకూర్చింది. ఫలితంగా సంస్థాగత ప్రసవాల శాతం 91 నుంచి 97 శాతానికి పెరుగగా, ప్రసూతి మరణాల సంఖ్య 92 నుంచి 56 శాతానికి తగ్గింది. నవజాత శిశు మరణాల సంఖ్య 39 నుంచి 17 శాతానికి తగ్గింది. పిల్లల వ్యాక్సినేషన్ రేట్ 68 శాతం నుంచి 96 శాతానికి పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టింది.
దళితుల సముద్ధరణ కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకానికి రూపకల్పన చేసింది. స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొని జీవించడానికి నిరుపేద దళిత కుటుంబాలకు ఎలాంటి షరతులు, బ్యాంకు లింకేజీ లేకుండా ఏకమొత్తంగా రూ.10 లక్షల నగదు సాయం అందించింది. పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 44 వేల దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ దళితబంధు పథకం స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేసి రూ.12 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ పథకాన్ని ప్రారంభించలేదు. దళితబంధు పథకాన్ని కొనసాగించకుండా రద్దు చేసింది.
వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తిదారులకు ముడిసరుకులు, యంత్రపరికరాల కొనుగోలుకు 100 శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థికసాయం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బీసీబంధు పథకాన్ని అమలు చేసింది. తొలివిడతలో 40 వేల మందికి రూ. లక్ష చొప్పున రుణాలు అందించింది. ఇంకా జాబితాలో 3.60 లక్షల మంది అర్హులకు ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని నిలుపుదల చేసింది.
గొల్లకురుమల కోసం కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.11 వేల కోట్లతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా అందులో 7.5 లక్షలకుపైగా యూనిట్లను పంపిణీ చేసింది. మొత్తంగా 1.80 లక్షల మందికి యూ నిట్లు అందజేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగానే తీసుకొని అమలు చేసింది. కానీ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. పథకానికి సంబంధించి దాదాపు రూ.10 వేల కోట్లను పెండింగ్‌లో పెట్టింది. పైసా విడుదల చేయడం లేదు. అదీగాక ఇటీవల జీవో 7 ద్వారా ఈ ఏడాది నుంచి కేవలం విద్యార్థుల ఖాతాలకే నిధులు జమ చేయాలని నిర్ణయించింది. దానిపైనా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.