కొణిజర్ల, జూలై 26 : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్లో పోడు సాగుదారులు, అటవీ అధికారుల మధ్య శనివారం వివాదం చోటుచేసుకున్నది. గుబ్బగుర్తి ఫారెస్టురేంజ్ పరిధిలో ఎల్లన్ననగర్ గ్రామస్థులు కొంతకాలంగా పోడు సాగు చేసుకుంటున్నారు. 2008 తర్వాత అటవీశాఖ అధికారులు వారికి హక్కుపత్రాలు ఇవ్వలేదు. శనివారం గుబ్బగుర్తి ఫారెస్టు బీట్ ఆఫీసర్లు విజయ, శ్రీను, సిబ్బంది వెళ్లి పోడు భూమిలో సాగు చేస్తున్న పత్తి మొక్కలు పీకేసేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు, మహిళలు, యువకు లు అడ్డుకున్నారు.
దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. తాము ఆ భూముల్లో ఏం డ్ల తరబడి సాగు చేసుకుంటున్నామని, అటవీశాఖ అధికారులు వచ్చి తమ పంట మొక్కలు పీకేశారని ఎల్లన్ననగర్ గ్రామస్థులు కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఎస్వో ఉ పేంద్రయ్య ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది కూడా ఫిర్యాదు చేశారు. హరితహారం మొక్క లు నాటిద్దామని వెళ్లగా.. అక్క డి వారు తమపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.