HILT- అనే ఆంగ్ల పదానికి నిఘంటు అర్థం.. ‘కత్తి పిడి’. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపైనే కాదు, పారిశ్రామిక ప్రగతిపైనా కత్తి దూస్తున్నది. పారిశ్రామికవేత్తలను రియల్ఎస్టేట్ దందావైపు మళ్లించేలా రూపొందించిన ఈ పాలసీతో ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతిననున్నాయి.
భారీ రాయితీ కింద 30శాతం రుసుము కడితే చాలు.. ఆ పరిశ్రమ భూమి మల్టిజోన్ కిందికి బదలాయించబడుతుంది. ఆ జాగపై వారికి పూర్తి హక్కులు లభిస్తాయి. నిరభ్యంతరంగా దాన్ని రియల్ఎస్టేట్ దందాకో, వెంచర్లకో, అపార్ట్మెంట్ల నిర్మాణానికో వాడుకోవచ్చు. రేవంత్ సర్కారు తెచ్చిన హిల్ట్ పాలసీలోని ఈ అంశం ఇప్పుడు విమర్శలపాలవుతున్నది. పాలసీలో డబ్బులు కడితే స్థలం హక్కుభుక్తం చేయడమే ఉన్నది తప్ప.. ఇంత రాయితీ పొందినందుకు ప్రత్యామ్నాయంగా మరోచోట పరిశ్రమ పెట్టాలన్న నిబంధన లేదు. ఇది పాలసీ పేరుతో రియల్‌ఎస్టేట్‌కు రెడ్‌కార్పెట్ పరచడమే కాదు.. హైదరాబాద్ చుట్టూ అల్లుకున్న పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేయడమే! కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్రమల ఏర్పాటు అంతంత మాత్రంగానే ఉండగా.. ఉన్నవాటినీ గొంతునులిమే కుట్ర ఇది!
(గుండాల కృష్ణ ) హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)’ విధ్వంసం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలు మూతపడి.. అవుటర్ అవతల కొత్త పరిశ్రమలు రాక రాష్ట్రంలో ఉత్పత్తి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పడిపోతాయని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కాలుష్యకారక పరిశ్రమలను అవుటర్ రింగు రోడ్డు అవతలికి తరలించాలని, అందుకే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. అయితే ‘హిల్ట్’ పాలసీ కాలుష్యాన్ని అవుటర్ అవతలికి తరలించేందుకా? ఉన్న పరిశ్రమల్ని మూసివేసేందుకా? అన్న చర్చ సర్వత్రా జరుగుతున్నది.
పాలసీ ఆద్యంతం రియల్ ఎస్టేట్ దందా తప్ప పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక్కటంటే ఒక్క చర్య కూడా కనిపించడంలేదనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా మూతబడిన పరిశ్రమలకు సైతం భారీ ఎత్తున రాయితీ కింద ప్రోత్సాహకం ఇస్తున్న ప్రభుత్వం.. లబ్ధిపొందిన పారిశ్రామికవేత్త అవుటర్ అవతల కచ్చితంగా పరిశ్రమ ఏర్పాటు చేయాలనే షరతును పాలసీలో ఎందుకు చేర్చలేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశ్రమలను కొనసాగిస్తూ జాతికి ఉత్పత్తులను అందించడంతోపాటు వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న పారిశ్రామికవేత్తలను అవుటర్ అవతలికి తరుముతున్న ప్రభుత్వం.. అక్కడ ప్రత్యామ్నాయ భూములు, మౌలిక వసతులను ఏమైనా కల్పిస్తున్నదా? అం టే సమాధానం లేదు.
అలాంటప్పుడు ఇక్కడ రూ.కోట్ల పెట్టుబడితో నడుస్తున్న పరిశ్రమను మూసివేసి, ఎలాంటి వనరులులేని చోట కొత్తగా పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఏ పారిశ్రామికవేత్త సాహిసిస్తాడు? మూతబడిన పరిశ్రమల యజమానుల మాదిరిగానే తమ పరిశ్రమల భూములను కూడా అగ్గువకు మల్టిపుల్ జోన్లుగా మార్చుకొని, ఎంచక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. అంటే.. కాలుష్యాన్ని అవుటర్ అవతలికి తరలించడం దేవుడెగురు! ఉన్న పరిశ్రమలు మూతబడి ఉత్పత్తితో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండి పడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అంతేకాదు కాలుష్యకారక పరిశ్రమల్ని అవుటర్ అవతలికి తరలించి ప్రజారోగ్యాన్ని కాపాడాలనుకుంటున్న ప్రభుత్వ పెద్దలు కాలుష్యరహిత, అసలు నడవని పరిశ్రమలకు కూడా హిల్ట్ కింద ఎందుకు రాయితీ ఇస్తున్నట్లు? వాటి నుంచి కాలుష్యమనేదే రానపుడు ఆ భూముల్ని కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చుకునేందుకు ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు? అందుకే దాల్మే కుచ్ కాలాహై! అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 27 ఇప్పుడు పారిశ్రామిక రంగానికి పెను సవాల్‌గా మారనుందనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. వాస్తవానికి కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించాలనే ప్రతిపాదన 2013లో ఉమ్మడి రాష్ట్రంలోనే తెరపైకి వచ్చింది. కానీ ఇప్పటివరకు సంపూర్ణంగా అమలు కాకపోవడానికి కార ణం.. కీలకమైన పారిశ్రామిక రంగం దెబ్బతినకుండా ఈ విధానాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేశాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వేగంగా, రాత్రికి రాత్రే ఈ ప్రక్రియను ముగిస్తామంటూ హిల్ట్ పాలసీని తెరపైకి తెచ్చింది. కేవలం 45 రోజుల్లోనే పాలసీని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఈ పాలసీ రూపకల్పనకు పనిచేశామని చెప్తున్న మంత్రివర్గ ఉపసంఘం కనీసం క్షేత్రస్థాయి పరిస్థితులు, వాస్తవాలు, పారిశ్రామికరంగం దెబ్బతినకుండా కనీస అధ్యయనంగానీ పరిశీలనగానీ చేసిన దాఖలాలు లేవు. పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించామని చెప్తున్నారుగానీ ఆ సమావేశంలో వచ్చిన కీలక డిమాండ్‌ను మాత్రం ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. అవుటర్ అవతలికి పరిశ్రమలను తరలించాలని చెప్తున్న ప్రభుత్వం అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూములు, మౌలిక వసతులను కల్పించాలని పలువురు పారిశ్రామికవేత్తలు నిజాయితీగా కోరారు.
కానీ గతంలో ఏర్పాటైన సెజ్‌ల్లో భూములు కొనాల్సిందే తప్ప కొత్తగా తాము ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అవుటర్ లోపలి పరిశ్రమలను మూసేందుకు అత్యంత చవక విధానంలో మల్టిపుల్ జోన్ల పేరుతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అంటే ఉన్న పరిశ్రమల మూతకు చొరవచూపిన సర్కారు అవుటర్ అవతల పరిశ్రమల ఏర్పాటును గాలికొదిలేసింది.
అవుటర్ లోపల ఉన్న 22 పారిశ్రామికవాడల్లో వేల సంఖ్యలో కాలుష్యరహిత పరిశ్రమలున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి జాబితాలో వేల ఎకరాల్లో ఈ గ్రీన్ జోన్‌లోని పరిశ్రమలు ఉన్నాయి. సాక్షాత్తు పీసీబీనే ఆ పరిశ్రమల నుంచి కాలుష్యం అనేది వెలువడదని నిర్ధారించింది. నగరంలో ఆ పరిశ్రమలు ఉండటంతో చుట్టూ లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కొన్ని తక్కువ లాభం వచ్చినా పారిశ్రామికవేత్తలు వాటిని నడుపుతుండటంతో రాష్ర్టానికి మేలు జరుగుతున్నది. ఇప్పుడు హిల్ట్ పాలసీ కింద ఆ పరిశ్రమల భూముల్ని మల్టిపుల్ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం వెనక ‘అవుటర్ అవతలికి కాలుష్యాన్ని పంపడం’ అనే ఉద్దేశం ఎలా వర్తిస్తుందో పాలసీ రూపొందించిన వారికే తెలియాలి.
హడావిడిగా హిల్ట్‌ను అమలులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఆగమేఘాల మీద కాలుష్యకారక పరిశ్రమలకు నోటీసులు జారీచేసింది. ఉన్నపలంగా పరిశ్రమలను అవుటర్ అవతలికి తరలించాలని హుకూం జారీచేసింది. కాలు ష్య నియంత్రణ మండలి నోటీసులు జారీచేసిన పరిశ్రమల్లో ప్రస్తుతం కొనసాగుతున్నవి ఎన్ని? మూతబడినవి ఎన్ని? అనే వివరాలే ప్రభుత్వం దగ్గర లేవని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అవుటర్ లోపల ఉన్న 22 పారిశ్రామికవాడల్లో వేల పరిశ్రమలు చాలా ఏండ్లుగా మూతబడ్డాయి. వాటి నుంచి కాలుష్యం రానందున తరలించాల్సిన అవసరం లేదు. కొందరు ప్రభుత్వ పెద్దలు ఖాయిలా పరిశ్రమల భూములపై కన్నేసి, ఇప్పటికే వాటిపై అనధికారిక ఒప్పందాలను చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశ్రమ నడవకుండా కాలుష్యం రాని, ఎవరికీ ఉపాధి కల్పించని భూములను హిల్ట్ కింద అడ్డికి పావుశేరులా మల్టిపుల్ జోన్‌గా మార్చడం వెనుక ఆంతర్యమేమిటో వారికే తెలియాలి. ఆ పారిశ్రామికవేత్తకు రాయితీ ఇచ్చి ప్రోత్సహించ డం వల్ల అవుటర్ అవతల కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న షరతు అయినా హిల్ట్ పాలసీలో ఉంచాలి. ప్రభుత్వం చెప్తున్న ఉప సంఘం ఈ అంశాన్ని ఎందుకు పరిగణనలోనికి తీసుకోలేదు? కన్వర్ట్ చేసే భూముల్లో మూతబడిన పరిశ్రమలవే అత్యధికంగా ఉన్నాయని సమాచారం.