హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌తోపాటు పట్టణ ప్రాం తాల్లో కులగణన సర్వే సమగ్రంగా జరగలేదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వేలో 94,261 ఎన్యుమరేషన్ బ్లాక్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు 50 రోజులపాటు జరిగిన పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రంలో కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా, కోటి 12 లక్షల కుటుంబాలను సర్వే చేశామని చెప్పారు. ఇందులో బీసీలు 56.66 శాతం ఉన్నారని, వారు ఆశిస్తున్న 42 శాతం రిజర్వేషన్ల కంటే ఇది 14.33 శాతం ఎక్కువ అని తెలిపారు.
సర్వే రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత బీసీల జనాభా పెరిగిందా? తగ్గిందా? అనే చర్చ జరుగుతున్నదని పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్ల్లు సాధించుకోవాలనే విషయంపై బీసీ నాయకులు, సంఘాలు దృష్టి సారించాలని కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నదని అన్నారు. కులాల పేర్ల మార్పులపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా కులాల జీవన స్థితిగతులను పరిశీలించి ఈ అంశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశమై ఉద్యోగుల వివరాలు సేకరించాలని కమిషన్ నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వ విభాగాలలో రోస్టర్ పాయింట్ రిజిస్టర్ నిర్వహణను పరిశీలించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వెనకబడిన తరగతుల కులాల సమగ్ర అధ్యయనం కోసం కుల సర్వే డాటాను ఇవ్వాలని ప్రణాళిక శాఖను కమిషన్ కోరనున్నదని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి పాల్గొన్నారు. ఇదిలాండగా, గతంలో సర్వే కొనసాగుతున్న సమయంలో డెడికేటెడ్ కమిషన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.