కడ్తాల్, జూన్ 25: గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్వర్ణోత్సవం పేరిట రేవంత్ సర్కార్ బస్సుయాత్ర చేయడం సిగ్గుచేటని గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బస్సుయాత్ర పేరుతో మరోమారు గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని అన్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ గిరిజన స్వర్ణోత్సవం పేరిట 50 రోజులపాటు బస్సు యాత్రను చేపట్టింది. బస్సు గురువారం కడ్తాల్ టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే గిరిజన సంఘాల నాయకు లు, ప్యూచర్ సిటీ భూ బాధిత రైతులు అడ్డుకొన్నారు. బస్సు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
గిరిజన నాయకులు, రైతులను పోలీసులు ఈడ్చిపడేశారు. అనంతరం గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ గిరిజన స్వర్ణోత్సవాలు జరుపుకొంటున్న రేవంత్ సర్కార్ ఇంతవరకు గిరిజనులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గిరిజనులకు మంత్రిపదవి కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది గిరిజన నాయకులకు అవకాశం కల్పించారని ప్రశ్నించారు. ఇటీవల డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రాంచందర్‌నాయక్‌తో ఇప్పటివరకు ఎందుకు ప్రమాణస్వీకారం చేయించలేదని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, గిరిజన తండాల అభివృద్ధికి కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్యూచర్‌సిటీ పేరుతో గిరిజనులకు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవడంపై మండిపడ్డారు. కార్యక్రమంలో నరేశ్‌నాయక్, రఘురాం రాథోడ్, గజనాయక్, పవన్రాథోడ్, సురేశ్‌నాయక్ పాల్గొన్నారు.