హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): వచ్చే ఐదేండ్లలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత మీడియాపాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. పదేండ్లలో పాలకులు ప్రజలను ఎలా మభ్యపెట్టారో బయటపెట్టేందుకు విద్యుత్తు, ఆర్థికశాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని చెప్పారు.
ప్రజలకు పరిస్థితిని తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రాలు ప్రవేశపెట్టామని అన్నారు. రైతులకు 2004లో 7 గంటలు, 2009 వరకు 9 గంటలు ఫ్రీ కరెంట్‌ను కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలు తీర్చలేదని విమర్శించారు. పదేండ్లలో కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని? విద్యా వ్యవస్థకు నిధులు ఇవ్వకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ ఒవైసీ లెకలకు స్పీకర్ ద్వారా సమాచారం అందజేస్తామని తెలిపారు. నేతలను కించపర్చేందుకు శ్వేతపత్రాలు పెట్టలేదని, నిజాలు చెప్పేందుకే అని అన్నారు.