బయ్యారం, డిసెంబర్ 5 : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, అభ్యర్థులకు ఆసక్తికర సన్నివేశం ఎదురైంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అజ్మీరా కల్పనాసునీల్నాయక్ శుక్రవారం మండల కేంద్రంలోని బాలానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీధిలోని మక్కల ధనమ్మ వద్దకు వెళ్లి తనకు ఓటు వేయాలని అభ్యర్థించింది.
ఈ క్రమంలోనే ధనమ్మ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘నాకు 18 గుంటల పొలం ఉన్నది.. యూరియా కోసం పోతే పట్టాపుస్తకం లేదని పోలీసోళ్లు రెక్క మీద చేయి వేసి నెట్టేసిండ్రు.. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం ఎక్కడా లైన్ కట్టలేదు.. ఎక్కడ యూరియా కట్ట ఉంటే అక్కడికెళ్లి ఏసుకొచ్చుకున్నాం.. ఈ సారి అట్టా ఎందుకు లేదు..? ఎందుకు యూరియా నిల్వ పెట్టలేదు.. నా చిన్న తనం నుంచి చూస్తున్న.. యూరియా కోసం ఎప్పుడూ ఇంత ఇబ్బందిపడలే. ఓట్లు ఏయించుకొని పోయిండ్లు. వస్తే అడుగుతా.., కేసీఆర్ ఉన్నప్పుడు లేని యూరియా ఇబ్బంది ఇప్పుడెందుకొచ్చింది?’ అంటూ ధనమ్మ ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తునే.., మరోవైపు కేసీఆర్ పాలనను గుర్తు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్గా మారింది.