హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేస్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్లియరెన్స్‌ను ఒకటిరెండు రోజుల్లో ఏసీబీకి పంపుతారని పేర్కొన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ- రేస్‌పై క్యాబినెట్లో సమగ్రంగా చర్చించినట్టు తెలిపారు. ఈ-రేస్‌తో వచ్చిన పెట్టుబడుల లెకను ఏసీబీ తేలుస్తుందని స్పష్టం చేశారు. దీని వెనుక చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని చెప్పారు. డబ్బును విదేశాలకు పంపితే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, ఆర్బీఐ అనుమతి కూడా అవసరమని తెలిపారు. ఈ అంశంలో అధికారులు సైతం విచారణ ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌పై విచారణకు ఇప్పటికే సీఎస్ అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఏజెన్సీల మీద కూడా కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారో, లేదో తనకు తెలియదని పేర్కొన్నారు. అయితే, తాను చెప్పింది తుస్సు బాంబో, ఏ బాంబో త్వరలో తేలుతుందని వ్యాఖ్యానించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్వోఆర్ చట్టాన్ని సభలో పెడతామని తెలిపారు.
ఏ జిల్లానూ రద్దు చేయం
రాష్ట్రంలో ఏ కొత్త జిల్లానూ రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శాసనమండలిలో విపక్ష సభ్యులు కల్వకుంట్ల కవిత, తక్కెళ్లపల్లి రవీందర్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. మహబూబాబాద్ జిల్లా రద్దు అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, కొడంగల్ ను జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదనా ప్రభుత్వం వద్ద లేదని పేర్కొన్నారు.
హైడ్రా అంటే ప్రజల్లో భయం లేదు
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్ర జల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ఉన్నా హై దరాబాద్కే అది పరిమితమని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోలేదని పేర్కొన్నారు. హైడ్రా అంటే ప్రజల్లో మొదట్లో భయం ఉండేదని, ఇప్పుడు నిజాలు తెలియడంతో భయం పోయిందని తెలిపారు. రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దాదాపు 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని వివరించారు. ఇందుకు రూ. 1000 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు అమరావతికి వెళ్లాయనే అపోహ ఉండేదని, అయి తే అమరావతిలో ఇటీవలి వరదలతో అంద రూ వెనక్కి వస్తున్నారని పేర్కొన్నారు. ఇ ప్పుడు హైదరాబాద్, బెంగళూరుకు మాత్ర మే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. జనవరి తర్వాత రాష్ట్ర ఆదాయం కూడా గ ణనీయంగా పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ ముందు నిలబడి ప్రసంగించాలని తనకు వ్యక్తిగతంగా కోరిక ఉన్నదన్నారు. అదానీ విషయంలో తాము పార్టీ జాతీయ పాలసీని అమలు చేస్తామని చెప్పారు. నిబంధనలు దాటి అదానీకి సహకరించడాన్ని మాత్రమే రాహుల్‌గాంధీ వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పులు చేయడం నిజమని మంత్రి పేర్కొన్నారు.