హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నది. ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు ఆయా జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో నిర్వహిస్తున్న తనిఖీల ద్వారా శనివారం రాత్రి వరకు రూ.74,95,31,197 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి పట్టుబడింది. తనిఖీలు ప్రారంభించిన నాటి నుంచి 14వ తేదీ రాత్రి వరకు సుమారు రూ.48,32,99,968 నగదు దొరికింది. పోలీసు, రవాణాశాఖ, కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, అటవీశాఖల చెక్‌పోస్టుల వద్ద తనిఖీల ద్వారా రూ.17,50,02,116 విలువైన వజ్రాలు, బంగారు, వెండి నగలు, ఇతర ఆభరణాలు పట్టుబడటం విశేషం.
పోలీసులు, ఇతర శాఖల అధికారులు నిత్యం ఎక్కడికక్కడే తనిఖీలు నిర్వహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే కేంద్ర ఎన్నికల సంఘం ఎంత నగదు తీసుకెళ్లాలనే అంశంపై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో దవాఖానలు, స్థలాలు, ఇతర అవసరాలకు తీసుకెళ్తున్న నగదు దొరికిపోతున్నది. దీంతో ఆ డబ్బును తమదిగా నిరూపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన యాప్ విధానంతో ఎప్పటికప్పుడు పట్టుబడిన డబ్బును బ్యాంకు అధికారులు తమ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. ఎక్కువమొత్తంలో పట్టుబడితే ఐటీశాఖ వచ్చి డబ్బులు తీసుకెళ్తున్నది. దీంతో సాధారణ ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇకనుంచైనా రూ.50 వేలకు మించి నగదు, ఆభరణాలు తీసుకెళ్తే.. తప్పనిసరిగా సంబంధిత రశీదులు తీసుకెళ్లాలని అధికారులు చెబుతున్నారు.