హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హవాతో 400పైగా సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్న వారికి దేశ ప్రజలు గట్టి గుణపాఠాన్ని నేర్పించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి కళ్లెం వేసే స్థాయిలో సీట్లు సాధించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ ఫలితాలు ఇండియా కూటమి నైతిక విజయమని, ఎన్టీఏ కూటమి అపజయంగా తాను భావిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ తక్కువ సీట్లకు పరిమితం కావడం జగన్మోహన్రెడ్డి నియంతృత్వ పోకడ, అహంకార వైఖరికి నిదర్శనమని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇండియా కూటమిలో చేరాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టులకు బలం ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలిచిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ జిమ్మిక్కులు పని చేయలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు.