హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని సోనియాగాంధీ అనుచరవర్గాన్ని ముఖ్యనేత బలిపీఠం ఎక్కిస్తున్నాడా? కేరళ అసెంబ్లీ ఎన్నికలకు మూటల కమిట్మెంట్ ఇచ్చి, బదులుగా సోనియమ్మ అనుచరుల రాజకీయ బలిని కోరాడా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి ‘అసలు కాంగ్రెస్’ను ఖతం చేసి ‘ఆయన’ కాంగ్రెస్‌నే నిలబెట్టుకొనే స్కెచ్ వేశారా? ఏఐసీసీలో నంబర్-2 నేతను వలలో వేసుకొని కాంగ్రెస్ వృక్షానికి ఉన్న పండు కొమ్మలను పొతంపట్టే పనిలో పడ్డారా? అధిష్ఠానం వద్ద చక్రం తిప్పగలిగే సీనియర్లను ఒక్కొకరినీ అడ్డు తొలగించుకొని, వారి స్థానాన్ని తన అనుయాయులతో నింపుతున్నారా? అంటే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. కేరళలో యూడీఎఫ్ కూటమి సీఎం అభ్యర్థి రేసులో ఏఐసీసీలోని నంబర్-2 నేత ముందువరుసలో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం ఇందుకు మరింత బలా న్ని ఇస్తున్నది. ముఖ్యనేతకు, ఢిల్లీ నంబర్-2 నేతకు మధ్య ఉన్న ఫెవికాల్ బంధానికి కాంగ్రె స్ నాయకుల మాటలు, కేరళకు తరలివెళ్లిన మూటలే నిదర్శనమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
తెలంగాణలో ముఖ్యనేతకు ఎదురులేకుండా చేసేందుకు సోనియాగాంధీ అనుచరవర్గాన్ని సమూలంగా పార్టీ నుంచి తప్పించే ఒ ప్పందం జరిగిందని, ప్రతిగా కేరళ అసెంబ్లీ ఎన్నికలకు రూ.1200 కోట్ల మూట తరలించారని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ జరుగుతున్నది. ఈ పథకంలో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని అవమానించి, పొమ్మనలేక పొగపెట్టారని చెప్పుకుంటున్నారు. ఆయన తర్వాత ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేత లు, దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు నేతలు లిస్టులో ఉన్నట్టు సమాచారం. తరచూ సీఎం కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ద్వారా కాకుండా, ఇతర మార్గాల్లో షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, తర్వాత వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
గురుదక్షిణ చెల్లింపుల వెనుక!
ఏఐసీసీలో నంబర్-2గా చెప్పుకొనే నేత కేరళలో యూడీఎఫ్ సీఎం అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్టు ఢిల్లీ కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. తనకు ముఖ్యనేత పీఠం అందించడంతోపాటు శత్రు శేషం లేకుండా సాయం చేస్తున్న గురువును గెలుపించుకునే బాధ్యత ముఖ్యనేత భుజాల మీద వేసుకున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ముఖ్యనేత పెట్టుబడులతో నడుస్తున్నదనే గుర్తింపు ఉన్న ఒక తెలుగు చానల్‌ను కేరళలో ప్రవేశపెట్టారని, ఎన్నికలకు సంబంధించి ప్రతి పైసా తెలంగాణ నుంచే పెట్టుకుంటామని ఢిల్లీ నేతలకు ముఖ్యనేత హామీ ఇచ్చారని తెలిసింది. అన్నట్టుగానే బిట్‌కాయిన్, హవాలా మార్గాల ద్వారా మూ టలు సర్దినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. . రాష్ట్ర పార్టీలో నంబర్-2గా పిలుచుకునే నేత బుధవారం రెండు గంటల పాటు తెలంగాణకు వచ్చి మళ్లీ వెంటనే వెళ్లిపోయారని, అక్కడ అడపాదడపా ఎన్నికల ప్రచారంలో పా ల్గొంటూ, అజ్ఞాతంలోనే ఎక్కువ సమయం ఉంటున్నట్టు సమాచారం.
ఎప్పటికైనా ముప్పే అనే భయం..
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డా రు. ఒక దశలో అధిష్ఠానం జీవన్‌రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలి చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు మంత్రిగా పనిచేసిన జీవన్‌రెడ్డికి నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నది. సోనియాగాంధీకి అత్యంత ఆత్మీయుడు. బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో ఎమ్మెల్సీగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఉత్తర తెలంగాణలో పార్టీని నిలబెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధిష్ఠానం వద్ద ఆయనకు ఉన్న పలుకుబడితో మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎప్పటికైనా తనకు ప్రమాదమే అని గుర్తించిన ముఖ్యనేత ఆయనను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆయనను పక్కన పెట్టి, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేను ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి తన అభ్యర్థులను నిలబెట్టి సత్తా చాటారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డి పట్టును పత్యక్షంగా చూసిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దూత నేరుగా అధిష్ఠానం దృష్టికి తీసుకుపోయినట్టు సమాచారం. అయితే ఏఐసీసీ నేత సహాయంతో ఆమె నివేదికను బుట్టదాఖలు చేసి, జీవన్‌రెడ్డిని పార్టీ నుంచి పంపించేందుకు ప్రయత్నం చేసి సఫలీకృతం అయినట్టు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
తర్వాత వెళ్లిపోయేది ఆయనేనా?
వైఎస్సార్ అకస్మిక మరణం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం ఎవరు? అనే చర్చ వచ్చినప్పుడు అధిష్ఠానం ముందుగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వైపు చూసింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. దురదృష్టం కొద్దీ 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణకు చెందిన వ్యక్తిని సీఎంగా పెట్టాలని ఆలోచించింది. ఈ సందర్భంగా సోనియాగాంధీ ఆయన పేరునే సూచించారని ఇప్పటికీ కాంగ్రెస్ వర్గాలు గుర్తుచేసుకుంటాయి. ఆయ న ఎమ్మెల్యే కాకపోవడంతో అధిష్ఠానం రోశ య్య వైపు చూసిందని శ్రేణుల్లో చెప్పుకుంటా రు. అటువంటి వ్యక్తిని ముఖ్యనేత ఆత్మహత్యకు పురిగొల్పినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు పార్టీ భీ ఫాం ఇచ్చి తిరిగి వెనకి తీసుకున్నప్పుడు మానసికంగా ఆవేదనకు గురయ్యానని, ఆ సమయం లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా.. పిల్లలు గుర్తుకురావడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నానని సదరు నేత ఇటీవల తన అంతరంగాన్ని బయటపెట్టారు.
కట్టప్పను అని చెప్పినా
ఇంకొక నేత ఏనాటికైనా తానే సీఎంను అవుతా అని ప్రకటించారు. ఆయనకు నోరున్న నేతగా పేరున్నది. ఇటీవల టీపీసీసీ అధ్యక్షునిగా ఆయన పేరు తెర మీదికి వచ్చింది. ఒక దశలో తాను ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించారు. ఇటీవల ఆయన పేరు టీపీసీసీ అధ్యక్షునిగా తెర మీదకు వచ్చినట్టు, కానీ ముఖ్యనేత మంత్రాంగం చేసి ఆదిలోనే అడ్డుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. పెద్దనోరున్న నేతగా పేరున్న ఆయనను ముఖ్యనేత దూరం పెట్టకుండా, దగ్గరికి తీయకుండా వ్యూహాత్మకంగా రాజకీయం చేశారని ప్రచారంలో ఉన్నది. వచ్చే జూన్ మాసంతో ఆయన భార్యకు ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవి ముగుస్తున్నది, ఈ పదవిని పొడగించాలని సదరు నాయకుడు ముఖ్యనేత చుట్టూ ఇప్పటి నుంచే తిరుగుతున్నట్టు సంగారెడ్డి జిల్లాలో చర్చ జరుగుతున్నది.
సీనియర్ ఎమ్మెల్యే మీద గురి
ఉత్తర తెలంగాణకు చెందిన మరో సీనియర్ నేత మీద ముఖ్యనేత గురిపెట్టినట్టు సమాచా రం. ఇటీవల ఆనారోగ్యంతో చాలా ఇబ్బంది పడిన ఆయన ఇప్పుడిప్పుడే అసెంబ్లీకి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీని సజీవంగా ఉంచటంలో ఆయనే కీలకం అని చెప్పుకుంటారు. తొలిరోజుల్లో ముఖ్యనేత పీసీసీ అధ్యక్షుడు కావటాన్ని, అనంతరం ముఖ్యనేత కావటాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీన్ని మనుసు లో పెట్టుకున్న ముఖ్యనేత ఆయనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని సమాచారం.
లాబీయింగ్‌తో వెనుకబడ్డ బీసీ బిడ్డ
రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నేత 2004లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఆయనకు ఖరారైనట్టేనని ప్రచారం జరిగింది. కానీ ముఖ్యనేత లాబీయింగ్‌తో ఆయన వెనుకబడి, అదే జిల్లాకు చెందిన బీసీ నేతకు పదవి వచ్చినట్టుగా గాంధీభవన్ వర్గాలు పేరొంటున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎంపీల ఎంపికలో ఆయన రేసులో ఉన్నారని, కానీ ముఖ్యనేత అడ్డంపడి ఆయనకు రాకుండా తన స్నేహితునికి ఇప్పించుకున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇలా తనకు అడ్డువస్తున్నారని భావించిన నేతలందరినీ ముఖ్యనేత ఒక్కొక్కరిగా బయటికి పంపిస్తున్నారని, ఉత్తర తెలంగాణ నేతలను పంపిన తర్వాత దక్షిణ తెలంగాణపై గురి పెడతారని చెప్పుకుంటున్నారు.
ఎంత భూమి ఉన్నా రైతుభరోసా ఇవ్వాలి ; మాజీ మంత్రి జీవన్‌రెడ్డి డిమాండ్
ఎంత భూమి ఉన్నా ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుభరోసా ఇవ్వాలని మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా ఎకరం ఉన్న వారికి మాత్రమే ఇవ్వడంతో ఎక్కువ భూమి ఉన్నవారు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రైతుబీమా పథకం ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల మందికి వర్తిస్తున్నదని, అసెంబ్లీ సమావేశాల్లో ఇందిరమ్మ కుటుంబ సమగ్ర బీమా పథకాన్ని ప్రకటించడంతో రైతులకు ఇంకో ఆందోళన మొదలైందని తెలిపారు. కొత్త పథకంలో కుటుంబ పెద్ద చనిపోతే రూ.5 లక్షలు అందజేస్తామని ప్రకటించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తూ, దానికి అర్హతలు లేని వారికి ఇందిరమ్మ సమగ్ర కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.