జగిత్యాల, జనవరి 10 : తెలంగాణ విద్యారంగం సంస్కరణల దిశలో సాగుతున్నదని, రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.1.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎస్సీ స్డడీ సర్కిల్‌ను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నదని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రాంతాల సమాన అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన గొప్ప ఫలితాలనిస్తున్నదని స్పష్టంచేశారు. స్వరాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో సంస్కరించే దిశలో సీఎం కేసీఆర్ పయనిస్తున్నారని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కేటగిరిలో వందలాది గురుకులాలను ఏర్పాటు చేశారని వెల్లడించారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఏటా 4.82 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది గురుకులాల్లో విద్యాభ్యాసం చేసిన వారిలో 250 మంది మెడిసిన్ కోర్సులకు, 700 మంది ఇంజినీరింగ్ కోర్సులకు, 150 మంది ఐఐటీ కోర్సులకు ఎంపికవడం తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థకు గర్వకారణమని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ గుగులోత్ రవి తదితరులు పాల్గొన్నారు.