రంగారెడ్ది జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన పాండు రంగారెడ్డి అనే వ్యక్తి పెళ్లి పేరుతో ఓ మహిళ చేతిలో మోసపోయాడు. దీంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించి తనను మోసం చేసిన వారిపై పిర్యాదు చేశాడు. విజయవాడకి చెందిన నాగలక్ష్మి అనే మహిళా తనను నమ్మించి పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. తనతో తాళి కట్టించుకున్న తర్వాత పెళ్లి కోసం చేయించిన 1.5 తులాల బంగారు నగలు, రూ.50వేల విలువ చేసే పట్టు వస్త్రాలతో పారిపోయినట్లు తెలిపాడు. ఇద్దరికీ పెళ్లి చేసిన మధ్యవర్తులకు రూ. 1.75 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. పెళ్లి పేరుతో తనను నమ్మించి మోసం చేసిన పెళ్లి కూతురుతో పాటుగా ఇతరులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కానీ పెళ్లి కూతురు నాగలక్ష్మి మాత్రం పెళ్లి కొడుకుతో పాటు మధ్యవర్తులు మాయ మాటలు చెప్పి మోసం చేశారని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. తనకు గ్రామంలో పెద్ద ఇల్లు, స్థిరాస్తులు ఉన్నాయని, నగరంలో పెద్ద సొంతిల్లు ఉందని చెప్పి మోసం చేసినట్లు చెప్పారు. ఇంట్లో కనీస వస్తువులు లేవని దీంతో పెళ్లి కొడుకుపై విరక్తి వచ్చి వెళ్లిపోయినట్లు తెలిపింది. పెళ్లికి పెట్టిన పూస్తే, చేతికి ఉన్న రింగు, కట్టు బట్టలతో వెళ్లానని, ఎవరిని మోసం చేయలేదని, ఎలాంటి వస్తువులు తీసుకు పోలేదని తెల్పింది. తనని మోసం చేసిన వారిపై కేసు పెట్టనున్నట్లు చెప్పిందని సమాచారం.