Vaikunta Dhamam | చారిత్రక వరంగల్ నగరం సరికొత్తగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేస్తున్న అభివృద్ధి పనులతో అన్ని వసతులను సమకూర్చుకుంటున్నది. రోజూ తాగునీటి సరఫరా, మెరుగైన రవాణా కోసం రోడ్ల విస్తరణ, మురుగునీటి పారుదల వ్యవస్థ, సమీకృత మార్కెట్లు, ఆహ్లాదం పంచే పార్కులతోపాటు వైకుంఠధామాలను నిర్మిస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 57వ డివిజన్లో రాష్ట్రంలోనే మోడల్ వైకుంఠధామం నిర్మించింది. నగరాల్లోని కిరాయి ఉండేవారి ఇండ్లల్లో ఎవరైనా కాలం చేస్తే ఇంటి యజమానుల నుంచి అవమానాలు ఎదురయ్యేవి. ఇక ఆ బాధలు తప్పాయి. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా గదులను నిర్మించారు.
అస్థికలు భద్రపరిచేందుకు లాకర్లు..
మృతదేహాల ఖననం కోసం నాలుగు బర్నింగ్ ప్లాట్‌ఫాంలను నిర్మించారు. దహన సంస్కారాలకు వచ్చేవారు అక్కడ నిల్చునేందుకు వీలుగా బర్నింగ్ ప్లాట్‌ఫాంకు ఎదురుగా పచ్చికను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా గదులు ఉన్నాయి. కర్మకాండలు చేసుకునేలా పెద్ద హాలు, రెండు గదుల భవనాన్ని నిర్మించారు. అస్థికలు భద్రపరిచేందుకు లాకర్లు, నిర్వహణ కోసం ఆఫీసు ఉన్నది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో విశాలంగా దీన్ని నిర్మించారు. రూ.3 కోట్లతో అన్ని వసతులు కల్పించారు.
జీవనతత్వం బోధపడేలా..
ఆధ్యాత్మిక చింతన కలిగేలా, పుట్టుక, చావుతో పాటు వీటి మధ్య ఉండే జీవన తత్వాన్ని తెలిపేలా ఇక్కడ గోడలపై బొమ్మలు వేశారు. బర్నింగ్ ప్లాట్ ఫారం వద్దకు వెళ్లే దారిలోని గోడలపై సత్యహరిశ్చంద్రుడు, కురుక్షేత్రంలోని ఘట్టాలను వివరించేలా బొమ్మలు ఉన్నాయి. ఉపదేశాలను రాయించారు. మొక్కలతో ఈ ప్రదేశం ఆహ్లాదంగా ఉన్నది. ఎక్కువగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కలను పెంచారు. ఆరు అడుగుల ఎత్తయిన శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉన్నది.
…?గోపాల్ పిన్నింటి