మెదక్ : ఆడబిడ్డగా అడుగుతున్న, అభివృద్ధి కావాలా? అరాచకాలు కావాలా? ఆలోచించి ఓటేయాలని బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి (MLA Padma Devender Reddy)ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హవేలీ ఘన్పూర్ మండలంలోని గంగాపూర్, షమ్నాపూర్, కొత్తచెరువు తండా, ఔరంగాబాద్ తండా, స్కూల్ తండా, లింగసాన్ పల్లి తండా, బ్యాతోల్, పాతూరు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ప్రచారం చేయడానికి వెళ్తే కొట్లాటలు తీసుకొచ్చే నీచమైన సంస్కృతి మంచి కాదన్నారు.
పది సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న మెదక్ నియోజకవర్గంలోకి ఎవరు వస్తే గొడవలు అవుతున్నాయో ప్రజలు గమనించాలని కోరారు. ఒక పార్టీ మీటింగ్ జరిగినప్పుడు మిగతా పార్టీ వాళ్లు అడ్డు పడటం సరికాదన్నారు. పోలీస్ స్టేషన్లో కేసులు లేకుండా పది సంవత్సరాల నుంచి మెదక్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు.
మైనంపల్లి హనుమంతు రావు ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలు నీళ్ల కోసం ఆరిగోసపడ్డారాని, అప్పుడు బోర్లు వేయడం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి నీటిని అందించారని అన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తీరిన తర్వాత ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బోర్లు వేయించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు, మంచి నీళ్లు, రైతుబంధు వంటి పథకాలు బంద్ అవుతాయని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.