కామారెడ్డి,ఆక్టోబర్ 27 : కామారెడ్డి(Kamareddy) నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్(CM KCR)ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి ఐక్యవేదిక నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో కవితను కలిశారు. కామారెడ్డిలో కేసీఆర్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ గెలుపు కామారెడ్డికి శక్తినిస్తుందని, ఈ ప్రాంతం ఊహించనంత అభివృద్ధి చెందుతుందన్నారు. కామారెడ్డి రూపురేఖలు మారడంతో పాటు పొరుగున ఉన్ను జిల్లాలు కూడా శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం వచ్చిందని, తమ ప్రాంతం మరింత అభివృద్ధితో దూసుకెళ్తుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని వివరించారు. ప్రత్యేక అభివృద్ధి నిధులతో కావాల్సినంత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పరిశ్రమలు, సంస్థలు వస్తాయని, దాంతో కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాలో ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు. సాగునీటి వనరులు పెరుగుతాయని, రైతులు ఎంతో లాభపడుతారని చెప్పారు.
సీఎం కేసీఆర్ కామారెడ్డిలో గెలవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కేసీఆర్ దూరదృష్టితో అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కలిగిందని, అగ్రవర్ణాలతో సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. కామారెడ్డిలో భారీ మెజార్టీతో సీఎం కేసీఆర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డిలో రాజబహద్దూర్ వెంకట్రాంరెడ్డి ట్రస్టుకు ప్రతిపాదించిన రెండు ఎకరాల భూమిని ఐదు ఎకరాలకు పెంచి కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయాన్ని రెడ్డి ఐక్యవేదిక నాయకులు ప్రస్తావించారు. భూవిస్తీర్ణం పెంచినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి, రాజబహద్దూర్ వెంకట్రాంరెడ్డి ట్రస్టు చైర్మన్ నాగర్తి చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి, పాల్గొన్నారు.