నూతనకల్, జూలై 14: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేపై డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న చేసిన తప్పుడు ఆరోపణలు ఖండించారు. మండల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాము చేసామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులకు మళ్లీ శంకుస్థాపనలు, కొబ్బరికాయ కొడుతూ తాము అభివృద్ధి చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
తక్షణమే రైతులకు వానాకాలం పంటలకు గోదావరి జలాలను అందించాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చార, ఏడాదిన్నర అయినా వాటి అమలు అతీగతీ లేదని విమర్శించారు. గత పది సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి కాళేశ్వర జలాలను తెచ్చి సస్యశ్యామల చేసిన ఘనుడు గాదరి కిషోర్ కుమార్ అని ఆయన అన్నారు. కరువుతో అల్లాడుతున్న తుంగతుర్తి ప్రాంతానికి గోదావరి జలాలను విడుదల చేయాలని ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేతగా డిమాండ్ చేయడం తప్పా అని ప్రశ్నించారు. బెదిరింపులకు బెదిరే పార్టీ బీఆర్ఎస్ కాదని స్పష్టం చేశారు. ఈ మండల పార్టీ కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్ ,మాజీ ఎంపీటీసీ సభ్యులు గార్డుల లింగరాజు, రేస్ వెంకటేశ్వర్లు, మొగుళ్ళ వెంకన్న కనకటి మహేష్ ఉప్పుల వీరు యాదవ్ విజయ్ శ్రీశైలం యాకాయ తదితరులు పాల్గొన్నారు