సూర్యాపేట టౌన్, డిసెంబర్ 24 : రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో జాతర కరోనా ఆంక్షల నడుమ నిర్వహించుకున్నామని, ఈ సారి 2023 ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న జాతరకు భక్తుల సందడి మరింత పెరుగనుందని అందుకు అవసరమైన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో పెద్దగట్టు జాతర నిర్వహణపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. 5 రోజుల పాటు నిర్వహించే పెద్దగట్టు జాతరకు 10 లక్షలకు పైగా భక్తులు దర్శించుకోనున్నారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌కు మంత్రి సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా సరిపడా నీరు అం దించాలని అధికారులను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టంగా పారిశుధ్య నిర్వహణను చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూ చించారు. బస్టాప్, లైటింగ్, పార్కింగ్, టాయిలెట్ వంటి సౌకర్యాలు కలిపించాలని భక్తులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు.
నిర్వహణకు 150 ఎకరాల సేకరణ
జాతరకు వచ్చే భక్తులు రాత్రి బసతో పాటు మొక్కులు చెల్లించుకుని వంటలు చేసుకుని ఆరగించే సంప్రదాయం ఉన్నందున అందుకు అనువైన స్థలం ఉండేందుకు రైతులకు పంట పరిహారం అందించి 150 ఎకరాలు సేకరించినట్లు మంత్రి తెలిపారు. గతంలో నీరు లేక పెద్దగట్టు పరిసరాలు బీడు భూములుగా ఉండటంతో భక్తులు అందులో బస చేసేవారన్నారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం జలాలు వస్తుండడంతో పెద్దగట్టు పరిసరాలు పంటపొలాలుగా మారిపోయిన నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం రైతులను ఒప్పించి 150 ఎకరాలు సేకరించినట్లు చెప్పారు. జాతరకు తెలంగాణ, ఆంధ్రా, సరిహద్దు రాష్ర్టాలతో పాటు లక్షలాదిగా తరలిరానున్న భక్తులకు రక్షణ కలిపించేందుకు భారీ బందోబస్తుతో పాటు అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లను అధికారులు, సిబ్బందితో సకాలంలో పూర్తి చేయాలని పోలీస్, రెవెన్యూ, హెల్త్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్ కోడి సైదులు యాదవ్, కౌన్సిలర్ జాటోత్ లక్ష్మీ మకట్లాల్లతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.