
సూర్యాపేట రూరల్: గుర్తు తెలియన వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామ శివారు చందన నర్సింగ్ కళాశాల వద్ద 65వ జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన మేక హర్షవర్ధన్ రెడ్డి(26), తిరుగుడు చంటి (26) ఇద్దరు తమ స్వగ్రామం నుంచి చివ్వెంల గ్రామానికి బుల్లెట్టు బండిపై బయలుదేరారు.
కొద్ది క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా ఈలోపే ఓ గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాలను సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. మృతుల్లో ఒకరైన చంటికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చంటి అన్న జితేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పీఎస్సై సైదమ్మ తెలిపారు.
మృత్యువులోనూ వీడని స్నేహం:
హర్షవర్ధన్‌రెడ్డి, చంటి ఇద్దరు చిన్న నాటి నుంచి ప్రాణ స్నేహితులు. బాల్యం నుంచి ఇద్దరు కలిసి చదువుకోవడంతో ఒకరం టే ఒకరికి ప్రాణం. ఇద్దరు సొంత పని మీద ద్విచక్ర వాహనంపై బయలుదేరి ఇద్దరు స్నేహితులు మృత్యు ఒడిలోకి జారు కున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాధచాయలు అలుముకున్నాయి.