సూర్యాపేటటౌన్ : తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెమిక్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ పండుగలను కూడా ప్రభుత్వమే అధికారికంగా ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించడం ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రిస్మస్, రంజాన్ ఇవే కాకుండా ఇతర పండుగలను కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు మామిడి శ్యాంసన్, సెంటినరీ బాప్టీస్టు చర్చి ఫాస్టర్ డాక్టర్ ఎం. ప్రభుదాస్, ఫాస్టర్ జాన్‌మార్క్, తదితరులు పాల్గొన్నారు.