పెన్ పహాడ్, జూన్ 18: నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం పంచుకోవాలని సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ (CI Rajashekar) అన్నారు. అత్యాశకుపోయి ఆర్థిక మోసాల బారినపడకూదని సూచించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పించడం పోలీస్ ప్రజా భరోసా ముఖ్య ఉద్దేశమని చెప్పారు. బుధవారం రాత్రి సూర్యాపేట రూరల్ మండలంలోని లింగాలలో పోలీస్ ప్రభా భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను గౌరవించాలని, మహిళలు, పిల్లలను వేధిస్తే కేసులు నమోదు చేసి జీవితకాలం శిక్షలు పడేలా పోలీసు దర్యాప్తు ఉంటుందన్నారు. అపరిచితులు ఫోన్ చేసినా, సోషల్ మీడియా ద్వారా, మెసేజ్‌ల ద్వారా చెప్పే మాటలు నమ్మి అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు.
రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని, మద్యం తాగి వాహనాలు నడపొదన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వవదని చెప్పారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు గ్రామాల్లోకి రానివ్వద్దని, ఎవరైనా డ్రగ్స్‌కు అలవాటు పడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామాల్లోని యువత చెడుమార్గంలో వెళ్లకుండా, వారు సన్మార్గంలో వెళ్లేలా మార్పుతేవడం కోసమే పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. నేరాల్లో చిక్కుకోవడం వల్ల యువత భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లే, పైచదువుల విషయంలో సమస్యలు వస్తాయన్నారు. ఏ వ్యక్తిపై అయినా ఒకసారి రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్ లాంటిది నమోదైతే జీవితాంతం ఆ మచ్చ అలాగే ఉంటుందని తెలిపారు. సైబర్ మోసాల బారిన పడి డబ్బు పోగొట్టుకుంటున్న, మత్తు పదార్థాలకు బానిసలై యువత మంచి భవిష్యత్తును కోల్పోవడం వంటి అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పెన్ పహడ్ ఎస్ ఐ కాస్తల గోపి కృష్ణ,హెడ్ కానిస్టేబుల్ మురళి, యాదగిరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.