సూర్యాపేట, జూలై 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూర్యాపేట (Suryapet) జిల్లా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో గత రెండు సీజన్లలో ప్రతి సారి దాదాపు 80వేల నుంచి లక్షకుపైనే ఎకరాల్లో వరి ఎండిపోగా.. ఈ వానాకాలం సీజన్‌కు అయినా కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వచ్చేనా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేనా అని రైతులు అనుమానంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రైతులు వరి నార్లు సిద్ధం చేసి దుక్కులు దున్నగా మరో పదిహేను రోజుల్లో వరి నాట్లకు అదును దాటి పోనుంది. కానీ జిల్లాలోని గోదావరి జలాల ఆయకట్టులో దాదాపు 80శాతం చెరువులు ఖాళీగా దర్శనిమిస్తుండగా కనుచూపు మేరలో నీళ్లు వస్తాయనే ఆశలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం జలాలతో కళకళలాడిన సూర్యాపేట జిల్లా నేడు కాంగ్రెస్ నిర్వాకంతో కరాళనృత్యం చేసే పరిస్థితికి వచ్చింది.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలతో పాటు రైతన్న భలపడ్డాడు. దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచుకోని పంట భూములపైకి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పంట పొలాలు సస్యశ్యామలం అయ్యాయి. ప్రధానంగా సూర్యాపేట జిల్లా పరిధిలోని 2.95లక్షల ఎకరాల శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు గత ఉమ్మడి రాష్ట్రంలో పీడకలగా ఉండగా కాళేశ్వరం జలాలు రావడంతో తలెత్తుకొని ధైర్యంగా సంతోషంగా జీవనం సాగించారు. కానీ సుమారు 20 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా తొలి యాసంగికి గోదావరి జలాలు రాకపోవడంతో వరి పంట ఎండిపోవడం విధితమే. తదనంతరం 2024 వానాకాలం, యాసంగిలో పంటలు ఎండడం ప్రభుత్వంపై రైతన్నలు ఆంధోళనలు, ప్రతిపక్షాల నిరసనలు పునరావృతం అయ్యాయి.
ఈ వానాకాలానికి శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు పరిధిలోని సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాలు ఇచ్చేందుకు ఇప్పటి వరకు షెడ్యూల్ ఖరారు కాకపోవడం పట్ల రైతులు అయోమయంలో ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వానాకాలానికైనా, యాసంగికైనా కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను నిరంతరాయంగా విడుదల చేసి దాదాపు మూడు నెలలు అంటే దాదాపు 85 నుంచి 100 రోజుల పాటు సీజన్‌కు 30 నుంచి 40 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేసి జిల్లాలోని 2.95లక్షల ఎకరాల్లో వరి పంట పండింది. అయితే ఇటీవల రైతన్నలు యాసంగి పూర్తి చేసుకొని వానాకాలం కోసం దుక్కులు దున్ని వరి నార్లు సిద్దం చేసుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వందలాది పిల్లర్లలో ఒకటి రెండు పిల్లర్లు కొద్దిమేర కుంగడంతో మరమ్మత్తులు చేయడం మాని రాజకీయం చేస్తూ ప్రాజెక్టును గాలికి వదిలేశారు.
ఓ ప్రక్క వర్షాలు రాక భూగర్బజలాలు అడుగుంటి పోతుండగా గత మూడు సీజన్లలో కాళేశ్వరం ఆయకట్టు పరిధిలోని జిల్లాలోని పంట చేతికి రాలేదు. ఈ సారి కూడా వానాకాలం సీజన్ ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. జిల్లాలోని శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో 670 వీటిలో 400లకు పైనే చెరువుల్లో నీటి నిలువలు 25శాతం మాత్రమే అంటే అడుగంటి పోయినట్లే ఉన్నాయి. మిగిలిన చెరువుల్లో 50శాతం వరకు నీళ్లు ఉన్నాయంటే వానాకాల సాగు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరో ప్రక్క కాళేశ్వరం నుంచి నీళ్లు రావాలంటే ఎస్ఆర్ఎస్పీ నుంచి రావాలి. కానీ ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలో 50 టీఎంసీలకు మించి నీళ్లు లేనట్లు తెలుస్తుండగా దాని దిగువన ఉన్న ఎల్ఎండీలో 30శాతం ఉండగా మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, బయ్యన్నవాగులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ లెక్కన ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి సాగునీరు వస్తుందా లేదా అనేది అనుమానాస్పధంగా మారింది. కాగా వానాకాలం సాగుపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమీక్ష చేసి నీళ్లిస్తామనే హామీతో వరి పంట వేయించడం లేదా పంటల మార్పిడీపై రైతులను ప్రిపేర్ చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, రైతులు మాత్రం మాయదారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు దరిద్రం పట్టుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వానాకాలానికి సంబంధించి ఇప్పటి వరకైతే నీటి విషయంలో ఎలాంటి అంచనాలకు రాలేదని తిరుమలగిరి ఇరిగేషన్ డివిజన్-2 ఈఈ ఎం.సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం పైన రిజర్వాయర్లు దాదాపు ఖాళీగానే ఉన్నాయి. ఒకవేళ ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు వస్తే దిగువకు నీళ్లు వస్తాయి. వరి నాట్లు వేసేందుకు మరొకిద్ది రోజులు సమయం ఉన్నందున రైతులు ఆచితూచి సాగు చేస్తే మంచిది.