సూర్యాపేటౌన్, జూన్ 21 : రైతులకు ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్నలాల్ పవర్ తెలిపారు. కలెక్టరేట్లో శనివారం ఉద్యానవన అధికారులు, పతంజలి సంస్థ అధికారులతో జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నర్సరీల్లో మొక్కల విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలన్నారు. 15 రోజుల్లో ఇప్పటికే ఆసక్తి చూపిన రైతులకు చెందిన 800 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ కోసం డీడీలే త్వరగా తీయించాలని.. ఎవరైనా ఆర్థిక సమస్య ఉన్న రైతులుంటే వారికి సహకార బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. రైతులకు ఇప్పటికే పంట చేతికి వచ్చిన ఆయిల్ పామ్ తోటలకు తీసుకెళ్లి రైతుల ద్వారా నూతన రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ఆయిల్ పామ్ సాగుపై రైతుల సందేహాలు తీర్చేందుకు కాల్ సెంటర్, మొబైల్ యాప్ ఏర్పాటు చేసి.. రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. ఇప్పటికే 4740 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుందని.. 2025-26లో జిల్లాలో నూతనంగా 3వేల ఎకరాల సాగు లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. జులై చివరి వారం నాటికి రైతులను గుర్తించాలని చెప్పారు. ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రం రైతులకు అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, ఉద్యానవన టెక్నికల్ అధికారి మహేశ్, మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్ నరేశ్, పతంజలి కంపెనీ అధికారులు యాదగిరి, హరీశ్ పాల్గొన్నారు.