e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home సూర్యాపేట వేసవి దుక్కులతో లాభాలెన్నో..

వేసవి దుక్కులతో లాభాలెన్నో..

వేసవి దుక్కులతో లాభాలెన్నో..

కోదాడ రూరల్‌, మే 10 : యాసంగి సీజన్‌ దాదాపుగా ముగిసింది. రైతులు సాగుచేసిన పంట ఉత్పత్తులు చేతికి వచ్చాయి. సాగు భూములు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలోనే భూసారం పెరిగేలా సరైనా జాగ్రత్తలు తీసుకుంటే వానకాలం పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవి దుక్కులకు, భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇదే సరైనా సమయ మంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల వానకాలం పంటలో తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఉపయోగకరంగా ఉంటుందని, దక్కులు దున్నడంతో రైతుకు కలిగే లాభ, నష్టాలను కోదాడ వ్యవసాయ డివిజన్‌ అధికారి వాసు వివరించారు.

దున్నకపోతే కలిగే నష్టాలు..
చాలా మంది రైతులు వానకాలం, యాసంగి పంట పండిన తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు. అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమినిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు గ్రహించుకుని ఆవిరై పోయే ప్రమాదం ఉంది.

వేసవి దుక్కితో లాభాలు ..
వేసవికాలంలో దక్కులు దున్నితే రైతులు పంటకోత అనంతరం పొలాన్ని అలా వదిలివేస్తుంటారు. దీంతో తొలకరి వానలు పడగానే నీరు భూమిలోకి ఇంకిపోకుండా బయటకు వెళ్తుంది. వర్షాలకు ముందే భూమిని దున్నడం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. తోతు దుక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. ఇలా భూమిలో తేమ శాతం పెరిగి, భూసారం అభివృద్ధి, పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, కలుపు మొక్కల నివారణ వగైరా ప్రయోజనాలు సమకూరుతాయి. వేసవి దుక్కులు దున్నే ముందు పశువులు పెంట, పోగు, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం ద్వారా సారవంతమైన పంట దిగుబడితో పాటు తేమశాతం పెరుగుతుంది.

భూసారం పుష్కలం..
వేసవి దుక్కులు లోతుగా, వాలుగా, అడ్డంగా దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. భూమి కూడా ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వేసవి దుక్కులు దున్నేముందు పొలంలో గొర్రెలు, పశువుల మందలు తోలడం వల్ల అవి విసర్జించిన వ్యర్థాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం తయారవుతుంది. ఫలితంగా భూసార వృద్ధ్దిలో ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా రైతులు పంట చేతికందగానే పంటల నుంచి వచ్చే ఎండు ఆకులు, చెత్త కాల్చివేయకుండా అవకాశమున్న వారు లోతు దుక్కులు చేయటం మూలంగా పంట చెత్త, చెదారం, ఎండు ఆకులు, నేల పొరల్లో కలిసిపోయి ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. పంటకు కావలసిన పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

చీడపీడలకు చెక్‌..
వేసవిలో చాలావరకు భూమి ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగులు పంటకోత దశల్లో వాటి నిద్రావస్థ దశలను నేల, చెత్త, చెదారం, కొయ్య కాడల్లో గడుపుతాయి. తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు తదితరమైనవి భూమి లోపల ఆశ్రయం పొందుతాయి. వీటి శిలీంధ్ర బీజాలు భూమిలో నిల్వ ఉంటాయి. వేసవి లోతు దుక్కుల వలన నిద్రావస్థ దశలో భూమిలోని చీడపురుగుల కో శాలు, గుడ్లు, లార్వాలు, గుడ్లను, పక్షులు, కొంగలు, కాకులు తిని వాటిని నాశనం చేస్తాయి. అదే విధంగా వేసవి దుక్కల వల్ల భూమిలోపల పొరల్లో ఉన్న శిలీంధ్ర బీజాలు మట్టతో పాటు నేలపైకి వస్తాయి. బయట అధిక ఉష్ణోగ్రతలకు అవి చనిపోతాయి.

కలుపును నివారణకు ఉపయోగకరం..
రైతులు సీజన్‌కు ముందుగా వేసవి దుక్కులను తయారుచేసుకోక పోవడంతో కలుపు పెరిగి రైతుకు అదనపు భారంగా మారుతుంది. పంట లేని సమయంలో కలుపు మొక్కలు పెరిగి అవి భూమిలోని నీరు, పోషకాలను ప్రత్యక్షంగా గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి.అంతే కాకుండా అనేక రకాల పురుగులు, శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించడం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి. కాబట్టి వేసవిలోతు దుక్కులతో పాతుకుపోయిన కలుపు మొక్కలు వాటి విత్తనాలు నేలపై పొరల్లోకి చేరి నశిస్తాయి.

  • వాసు, కోదాడ ,ఏడీఏ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వేసవి దుక్కులతో లాభాలెన్నో..

ట్రెండింగ్‌

Advertisement