మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఒడ్డున కృష్ణానదిలో (Krishna River) వారం రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో విష పదార్థాలు, కెమికల్స్ (రసాయనాలు) కలిపి వెళ్తున్నారు. దీనిని గమనించిన భక్తులు, దేవాలయ సిబ్బంది, ధర్మకర్తలకు విషయం చెప్పడంతో వారు గత సోమవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు చెం దిన కోదాడ డివిజన్ ఎస్ఈ నాగభూషన్ కృష్ణ మట్టపల్లిలోని నదిని, నదిలోని నీటిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటనకు కారణమైన వ్యక్తులు లేదా పరిశ్రమలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా నదిలో కలుషితమైన రసాయనాలను తొలగించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. అప్పటి వరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవాలయ అధికారులు బోరు నీటితో భక్తులు పుణ్యస్నానాలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ విషయంపై స్పందించిన ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్ మాట్లాడుతూ స్నానాలు చేసే భక్తులకు ప్రస్తుతం ఇబ్బందులు రాకుండా బోరు నీటి వసతి కల్పించామన్నారు. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిల్వ ఉండటం వలన ఆలయానికి రక్షణగా ఉన్న గోడకు లీకేజీ ఏర్పడి నదిలోని నీళ్లు ఆలయ పరిసరాల్లోకి వస్తున్నాయన్నారు. గోడ లీకేజీ సమస్యను పరిష్కరించాలని ధర్మకర్తలు ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకు లీకేజీ, సీపేజీ అరికట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నదిలోని నీటిని ఇతర అవసరాలకు వాడుతున్నామని, ప్రస్తుతం మంచి నీటి కోసం బోరు నీటినే వాడుతున్నామని గ్రామ ప్రజలు తెలిపారు. దీంతో బోరు నీరు కూడా కలుషితమయ్యేలా ఉన్నదని, తద్వారా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చేపలు పట్టేందుకు వెళితే నదిలో దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానిక జాలర్లు పేర్కొన్నారు.