యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ);సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు. ఎవరు ఏ రంగంలో రాణించినా, ఎల్లలు దాటి గల్లాలు ఎగురవేసినా వారిని తీర్చిదిద్దడం వెనుక గురువుల పాత్ర వెలకట్టలేనిది. అంతటి పవిత్ర స్థానంలో ఉన్నారు గనుకే టీచర్లకు ప్రత్యేక గౌరవం. మంచీ చెడుల విశ్లేషణలో వారి మాటకు విలువ ఉంటుంది. ఆ నిబద్ధతతోనే ఆనాడు ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని విశ్వసించి ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతే ధీమాగా స్వరాష్ట్రంలో ఆ ఫలాలను పొందుతున్నారు. అన్ని రంగాల మాదిరిగానే ఉపాధ్యాయుల సంక్షేమమే గాక, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపైనా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన గణనీయమైన ప్రగతిని, అదే సమయంలో దేశంలోని అస్తవ్యస్త, అప్రజాస్వామిక పరిస్థితులను చూసి.. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశమంతా విస్తరిస్తే బంగారు భారత్ సాధ్యమతుందని బలంగా చెప్తున్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల ఉపాధ్యాయుల కంటే ఇక్కడే అత్యధికంగా వేతనాలు చెల్లిస్తుండడం, ఉద్యోగ విరమణ వయసు పెంపు, అంతర్ జిల్లాల బదిలీలు, భార్యభర్తల స్పౌజ్ ట్రాన్స్ఫర్లు, రిటైర్మెంట్ గ్రాట్యుటీ పెంపు, హెల్త్‌కార్డులతో ఉచిత వైద్యం.. వంటి అంశాలనూ ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.
జై తెలంగాణ.. ఒకప్పుడు ఈ పదం పలుకడానికే జనం వెనుకాడిన రోజులున్నాయి. కానీ ఆ పరిస్థితి నుంచి ఏకంగా తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్నే సాధించిన గొప్ప ధీశాలి కేసీఆర్. అంతే కాకుండా సాధించిన రాష్ట్రం ఆగం కాకుండా కంటికి రెప్పలా కాపాడిన మహానేత. రాష్ర్టాన్ని దేశానికి రోల్ మాడల్‌గా మార్చి.. అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపిన పాలనాదక్షుడు. విద్యారంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన విద్యాప్రదాత. కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉపాధ్యాయులకు సైతం మంచి రోజులొచ్చాయి. టీచర్లను సర్కారు అన్ని విధాలుగా ఆదుకున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా జీతాలు చెల్లిస్తున్నది. ఇట్ల అనేక విధాలుగా దేశానికే రోల్ మోడల్‌గా మారింది. ఇదే విధంగా దేశమంతా ప్రవేశపెట్టాలని ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇది కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని విశ్వసిస్తున్నామని చెబుతున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నామని ప్రకటిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాకే హెల్త్ కార్డులు..
స్వరాష్ట్రంలో ఉపాధ్యాయులకు వచ్చిన సంస్కరణల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) ఒకటి. సమైక్య పాలనలో టీచర్లకు ఈహెచ్ఎస్ సదుపాయం లేదు. ఉపాధ్యాయుల పరిస్థితులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్.. వారికోసం దీన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఉపాధ్యాయుడితోపాటు భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు కూడా ఇది వర్తిస్తుంది. సర్కారు గుర్తించిన ఏ కార్పొరేట్ హాస్పిటల్‌లోనైనా రూ. ఐదు లక్షల వరకు చికిత్స పొందవచ్చు. దీని ద్వారా వేల మంది ఉచితంగా ఆపరేషన్లు చేయించుకున్నారు. ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. అంతే కాకుండా డబ్బులు రీయింబర్స్ కూడా చేసుకొనే అవకాశం కల్పించారు.
వేరే రాష్ర్టాల్లో జీతాలు రూ. 30వేల లోపే..
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఉపాధ్యాయులు సంతోషంగా జీవిస్తున్నారు. తమ ఉద్యోగాన్ని ప్రశాంతంగా చేసుకుంటూ కుటుంబాలతో ఆనందంగా ఉంటున్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎవరూ ఊహించని రీతిలో పీఆర్సీ ఇచ్చి అబ్బురపరిచారు. ఏకంగా 43శాతం పీఆర్సీ ప్రకటించారు. ఆ తర్వాత రెండో పీఆర్సీలో కూడా ఉపాధ్యాయులకు న్యాయం చేశారు. 30శాతం పీఆర్సీ ఇచ్చి మరోసారి టీచర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా నిరూపించుకున్నారు. దాంతో ఉపాధ్యాయుల జీతాలు ఒక్కసారి భారీగా పెరిగిపోయాయి. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే మన ఉపాధ్యాయుల జీతాలు డబుల్ అయ్యాయి. ఇతర రాష్ట్రంలో సీనియారిటీని బట్టి రూ. 30వేల లోపే వేతనాలు ఉండగా, తెలంగాణలో మాత్రం రూ. 60 నుంచి రూ.70వేలకు పైనే చెల్లిస్తున్నారు.
ఉద్యమ నాయకుడితో సుస్థిర పాలన
తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్ర సాధనలో సఫలీకృతుడైన సీఎం కేసీఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజనీతిజ్ఞుడు. దేశ రాజకీయాలపై పట్టున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు సుస్థిర పాలన అందుతుంది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరవవుతాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తున్నారు. ప్రభుత్వ విద్యకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి మన ఊరు..మనబడి కార్యక్రమంతో పాఠశాలలను బలోపేతం చేస్తున్నారు.
గురుకులాల ఏర్పాటుతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య లభిస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలనూ పరిష్కరిస్తున్నారు. ఆశించిన స్థాయిలో టీచర్లకు జీతాలు అందుతున్నాయి. దేశ వనరులు కార్పొరేట్లకు ధారాదత్తం కాకుండా ఉండాలంటే దేశాన్ని ప్రగతి పథంలో నడుపగల సత్తా కేసీఆర్‌కే ఉంది. కేసీఆర్ అపార జ్ఞానం, అనుభవంతో తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంతో దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తున్నది. తెలంగాణ పథకాలు తమకూ కావాలని కోరుకుంటున్నారంటే మన దగ్గర అభివృద్ధి ఎలా ఉందో అర్థమవుతున్నది. సబ్బండ వర్గాల మన్ననలు పొందిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగింది
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీంఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో వెళ్తే ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా వంటి బృహత్తర పథకాలు అమలు చేస్తున్నారు. రైతులకు ఎరువుల ధరలు తగ్గించడమే కాకుండా ఉచితంగా పంపిణీ చేసే ఆలోచన కూడా ఉన్నట్లు కేసీఆర్ ప్రస్తావించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకే వెళ్తే ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు రక్షించబడుతాయి. రాష్ట్రంలో నిరుపేదలకు గుణాత్మక విద్యను అందించడానికి అనేక గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేయగా విద్యాపరమైన ప్రయోజనాలను అన్ని రాష్ర్టాలకు కల్పిస్తారు. కేంద్రీయ విద్యాలయాల సంఖ్యను మరింత పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో నిరుద్యోగుల కోసం భారీ స్థాయిలో నోటిఫికేషన్లు వచ్చినట్లే దేశంలో కూడా అన్ని క్యాడర్లలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అన్ని రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి కేసీఆర్ పాటుపడుతారని విశ్వాసం ప్రజల్లో ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి అభివృద్ధి చేస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎదిగిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు.
-లచ్చిరాంనాయక్, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, తెరట్పల్లి, చండూరు మండలం
సీఎం కేసీఆర్‌తో దేశ రాజకీయాల్లో మార్పు
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రాకను స్వాగతిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో దోపిడీకి గురైన తెలంగాణకు విముక్తి కలిగించేందుకు కంకణం కట్టుకొని తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ర్టాన్ని సాధించిన నేత కేసీఆర్. తన ఆలోచనా పటిమతో ఎంతో మంది సహకారంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన రథసారథి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యలో అనేక సంస్కరణలు చేశారు. ఇంగ్లిష్ మీడియంలో పేద విద్యార్థులకు బోధన అందిస్తున్న అపర చాణక్యుడు. మన ఊరు-మనబడితో ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా మారుతున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా డిజిటల్ క్లాస్ రూమ్స్ అందుబాటులోకి వచ్చాయి. పిల్లలకు సన్నబియ్యంతో భోజనం పెట్టడం గొప్ప విషయం. గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతాయి. దేశంలోని అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యం.
– జనగాం వెంకన్నగౌడ్, ప్రాథమిక పాఠశాల ఎలుగులగూడెం, మునుగోడు మండలం
రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దే..
కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో ఉన్నట్లయితే అన్ని రాష్ర్టాల్లో రూపురేఖలు మారిపోతాయి. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం పథకాలు మిగతా రాష్ర్టాలకు విస్తరింపజేసే అవకాశం ఉంటుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎంతో రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. విద్యార్థుల చదువుతోపాటు ఉద్యోగులకు అన్ని విధాలా మేలు చేస్తున్నారు. నేడు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అది సీఎంకేసీఆర్తోనే సాధ్యమైంది. యావత్ దేశం ప్రస్తుతం తెలంగాణ వైపు చూస్తున్నది. తెలంగాణ లాంటి పాలన మాకు కావాలనే వాదన ఇతర రాష్ర్టాల్లో ఉన్నది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది.
–నామిరెడ్డి మహేందర్‌రెడ్డి, ప్రాథమిక పాఠశాల రాంనగర్ ఉపాధ్యాయుడు, తిప్పర్తి మండలం
సీఎం కేసీఆర్ రాక ఒక ప్రభంజనం
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వస్తే ఒక ప్రభంజనంగా మారుతుంది. దేశ అభివృద్ధికి విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్తుకు బాటలు పడుతాయి. దేశంలో జల వనరుల వినియోగం మొదలు, రైతుల సంక్షేమంపై సీఎం కేసీఆర్‌కు అపార జ్ఞానం ఉంది. రైతాంగం, పారిశ్రామికంగా దేశంలో విప్లవాత్మక మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతారనే నమ్మకం ప్రజల్లో ఉంది. దేశంలో ఆర్థిక మాంద్యం, రూపాయి పతనం, నిత్యావసర ధరల పెంపుతో దేశ ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం దేశ భవిష్యత్తు దృష్ట్యా అత్యవసమరని చెప్పవచ్చు. దేశంలోని సబ్బండ వర్గాల అభివృద్ధి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ అరంగేట్రంతో సాధ్యమవుతుంది. ఇప్పటికే తెలంగాణ అభివృద్ధిలో దేశానికే ఒక రోల్ మాడల్‌గా నిలిచింది.
– చంద్రశేఖర్, హెచ్ఎం, జడ్పీ ఉన్నత పాఠశాల, చందంపేట
కార్పొరేట్‌కు దీటుగా పేదలకు నాణ్యమైన విద్య
తెలంగాణ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మంచి విజన్ ఉన్నది. కొన్నేండ్ల తర్వాత అవసరాలను గుర్తించి అందుకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేయడంలో ఆయనకు ఎవరూ సాటిలేరు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు పెంచడంతోపాటు విద్యారంగంలో పెనుమార్పులు తెచ్చారు. నిరుపేద విద్యార్థులకు గురుకులాలు అందుబాటులో తెచ్చి ఆర్థిక సమస్యలతో వారి చదువు మధ్యలోనే నిలిచిపోకుండా చేశారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవడం సంతోషకరం. మన ఊరు-మన బడి పథకం కింద సర్కారు పాఠశాల భవనాలకు నిధులు మంజూరు చేస్తున్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శనీయంగా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధరలను విపరీతంగా పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఖండించే ప్రతిపక్షం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజీకీయాల్లోకి సీఎం కేసీఆర్ ప్రవేశించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆ లోటు పూడిపోతుంది.
– షేక్ ఖాసీం, ఎస్జీటీ, హేమ్లాతండా, మేళ్లచెర్వు మండలం