కోదాడటౌన్, ఆగస్టు 22 : దేశం గర్వపడేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించిందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా సోమవారం స్వర్ణభారతీ చారిటబుల్ ట్రస్ట్, కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో 2 వేల అడుగుల పొడవున్న జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ వందలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా వజ్రోత్సవ వేడుకలను గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించి ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపిందన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు, యువత ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశానికి సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ చింతా కవితారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, స్వర్ణభారతి ట్రస్ట్ అధ్యక్షుడు గాధంశెట్టి శ్రీనివాస్‌రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకల శ్రీనివాస్‌రావు, బొలిశెట్టి కృష్ణయ్య, పైడిమర్రి వెంకటనారాయణ, టీఆర్ఎస్ నాయకులు సత్యబాబు, వార్డు కౌన్సిలర్లు గుండెల సూర్యానారాయణ, ఖదీర్ పాషా, వంటిపులి శ్రీనివాస్, ఖాజా మొహినుద్దీన్, కట్టెబోయిన శ్రీనివాస్, కందుల చంద్రశేఖర్, గ్రంథాలయ చైర్మన్ రహీం పాల్గొన్నారు.