భువనగిరి అర్బన్, జూన్ 29 : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పాలిసెట్-2022 (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) గురువారం నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 11నుంచి మధ్యాహ్నాం 1.30 గంటల వరకు జరుగనున్నది. పరీక్షల నిర్వహణకు 7 సీఎస్‌లు, ఏసీఎస్‌లను పర్యవేక్షకులుగా నియమించారు. ఈ పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1783 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 946 మంది, బాలికలు 837 మంది ఉన్నారు. ప్రతి 24 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఇన్విజిలెటర్‌ను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. వైద్య సిబ్బంది, తాగునీటి వసతి అందుబాటులో ఉంచారు.
పాలిసెట్ పరీక్షా కేంద్రాలు..
జిల్లాలో 7 పాలిసెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో భువనగిరి పట్టణంలో 5 ఉన్నాయి. 1. శ్రీ లక్ష్మీనర్సింహస్వామి డిగ్రీ కళాశాల, ఇందులో 400 మంది, 2. జాగృతి డీగ్రీ కళాశాలలో 256, 3. నవభారత్ డిగ్రీ కళాశాలలో 255, 4. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 250, 5. శ్రీ గాయత్రి బాలికల జూనియర్ కళాశాలలో 200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అదేవిధంగా యాదగిరిగుట్టలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇందులో 218 మంది, 2. పాలిటెక్నిక్ కళాశాలలో 204 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందే విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాలి. పరీక్ష రాసే విద్యార్థులు తప్పకుండా 10 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
పాలిసెట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భువనగిరి కోఆర్డినేటర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే చేరుకోవాలన్నారు. విద్యార్థులు హెచ్‌బీ పెన్సిల్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ పెన్ను వెంట తెచ్చుకోవాలని సూచించారు.
విద్యార్థులు పాటించాల్సిన సూచనలు
పరీక్ష కేంద్రానికి హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ పెస్ తప్పకుండా తీసుకురావాలి. హాల్ టికెట్ మీద పోటో ప్రింట్ కాని యెడల, అలాంటి అభ్యర్థులు తమ వెంట ఒక పాస్‌పోర్టు సైజ్ పోటో, ఐడీ ప్రూఫ్ (ఆధార్‌కార్డు) తెచ్చుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి సెల్పోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవు. పరీక్ష రాసే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలి.