హాలియా, జూన్ 11 : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర, గుర్రంపోడు, మాడ్గులపల్లి, తిరుమలగిరి సాగర్ మండలాలకు చెందిన 80 మందికి రూ.34లక్షలా 66 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి వినూత్న పథకాలతో పేదలకు అండగా ఉంటున్నారని తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలను సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఏడాది కాలంలో నియోజకవర్గంలో సుమారు వెయ్యి మందికి 3 కోట్ల రూపాయలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, గుర్రంపోడు వైస్ ఎంపీపీ ధునుంజయ్, టీఆర్ఎస్ పార్టీ అనుముల, తిరుమలగిరి సాగర్, పెద్దవూర, త్రిపురారం, గుర్రంపోడు మండలాల అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, రవినాయక్, సత్యపాల్, బహునూతల నరేందర్, ఎంపీటీసీ అంబటి రాము, నాయకులు కామర్ల జానయ్య, పగడాల పెద్దిరాజు, మెండె సైదులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.