సకల ప్రాణకోటికి జీవనాధారం నీరు. మన చుట్టూ ఉన్న నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామన్నది మానవ మనుగడలో కీలకమైన అంశం. వర్షపాతం ఏ ప్రాంతంలో ఎలా ఉంది, భూగర్భ జలం ఎక్కడ పుష్కలంగా లభిస్తున్నది, ఎక్కడ కొరత కనిపిస్తున్నది తెలుసుకోగలినప్పుడే భవిష్యత్ అవసరాలను అంచనా వేయగలం. ప్రభుత్వం కూడా కరువు చాయలను ముందుగానే గుర్తించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో పరిష్కార మార్గాలను చూపగలుగుతుంది. పటిష్టమైన నీటి యాజమాన్య పద్ధతులతో తాగు, సాగునీటి అవసరాలను తీర్చగలుగుతుంది. అందుకోసం రాష్ట్ర సర్కారు వర్షపాతం నమోదు, భూగర్భజలాల స్థాయిని కచ్చితంగా తెలుసుకోవడంపై దృష్టి పెట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కొత్తగా 77 ఫిజో మీటర్లు, 10 వర్షపాత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే ఉన్నవాటికి తోడు 20 ఫిజోమీటర్లు, 5 వర్షపాత నమోదు కేంద్రాలను నిర్మించింది. నల్లగొండ జిల్లాలో అదనంగా 57 ఫిజోమీటర్లు, 5 వర్షపాత నమోదు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నది.
సూర్యాపేట, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలకు ప్రాధాన్యతను ఇస్తూ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించేలా అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. గతంలో ప్రధానంగా వ్యవసాయం అత్యంత దీనస్థితికి చేరుకొని అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు వేలాదిగా ఉండేవి. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి కావాల్సిన నీళ్లు, ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తున్నారు. అందులో భాగంగా ఎప్పటికప్పుడు భూగర్భ జలాలు, వర్షపాతం ఏటేటా కచ్చితంగా తెలిస్తే తదనుగుణంగా పంటలు వేయడం, అవసరం ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించడం వీలవుతుందని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు విరివిగా వర్షపాత నమోదు, ఫిజో మీటర్లు(భూగర్భ జలాలను కొలిచే యంత్రాలు)ను ఏర్పాటు చేస్తున్నది. జిల్లాలో భూగర్భ జలాలు ఎంత లోతులో ఉన్నాయి. ఏ మండలంలో ఇబ్బందులుండే పరిస్థితి ఉండేది. తదితర వివరాలను అంచనా వేసేందుకు కొత్త మండలాలతో పాటు అవసరమైన ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ బేసిన్స్ ఉంటాయని అలాంటి బేసిన్స్‌లో రెండు నుంచి మూడు ఫిజో మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో 10 వర్షపాతం నమోదు కేంద్రాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో కొత్తగా సుమారు రూ.23 లక్షలతో 77 చోట్ల ఫిజో మీటర్లు, 10 ప్రాంతాల్లో వర్షపాత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీటిలో ఇప్పటికే సూర్యాపేట జిల్లా పరిధిలోని 23 మండలాల్లో గతంలో 30 ఫిజో మీటర్లు ఉండగా మరో 20 ఏర్పాటయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 31 మండలాల పరిధిలో 84 వర్షపాత నమోదు కేంద్రాలు ఉండగా మరో 5 ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో 82 ఫిజో మీటర్లు ఉండగా నిధులు మంజూరైనందున అదనంగా త్వరలోనే 57 ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అన్ని ప్రాంతాల్లో నీటి మట్టాలు తెలుస్తాయి
గతంలో ఉన్న ఫిజో మీటర్లతో పాటు ప్రభుత్వ ఆదేశాలతో అవసరమున్న ప్రతి చోటా ఫిజో మీటర్లు ఏర్పాటు చేశాం. దాంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నీటి మట్టాలు తెలుస్తాయి. ఫిజో మీటర్ అంటే బోరు వేసి దానికి తాళం వేసి పూర్తి భద్రత కల్పిస్తాం. అత్యధికంగా విద్యుత్ సబ్స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వేస్తాము. నెలకోసారి జియాలజిస్టులు పరిశీలించి రిపోర్టులు తయారు చేస్తారు.
– టి.సుధాకర్‌రెడ్డి, జిల్లా భూగర్భ జల అధికారి-సూర్యాపేట