భువనగిరి అర్బన్, ఏప్రిల్ 26 : సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద మన రాష్ట్రంలో పది గ్రామాలు ఎంపికయ్యాయి. ఇందులో యా దాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామానికి ప్రథమ ర్యాంకు, ఆలేరు మం డలంలోని కొలనుపాక గ్రామానికి 5వ ర్యాంకు లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క గంగదేవులపల్లి గ్రామాన్ని మాత్రమే ఆదర్శ గ్రామంగా పేర్కొనేవారు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పల్లెప్రగతితో రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామపంచాయతీలకు నిధులు, అదనపు వనరులు,హంగులు తోడై అన్ని రంగాలల్లో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఈ పంచాయతీ, ఈ ఆడిటింగ్, బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్) వంటి అంశాల్లో తెలంగాణలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
ప్రస్తుతం ఎంపిక చేసిన సంసద్ ఆదర్శ గ్రామాల్లో దేశంలో టాప్ 10 గ్రామాల్లో వడపర్తి గ్రామానికి (స్కోర్-92.7) ప్రథమ ర్యాంకు, ఆలేరు మండలం కొలనుపాల గ్రామానికి (స్కోర్ -90.94) 5వ ర్యాంకు వచ్చింది. అదేవిధంగా నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమన్ గల్ (స్కోర్-89.17)16 స్థానం, నల్లగొండ మండలం బుద్దారం గ్రామానికి (స్కోర్-87.81) 19వ ర్యాంకు వచ్చింది.“ సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన పల్లెప్రగతితో సాధించిన ప్రగతి ఇది. తెలంగాణ వస్తే ఎం వస్తది అన్న వాళ్లకు ఇది సూటి సమాధానం.” అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆయన అభినందించారు. గతంలో వచ్చిన 19 అవార్డులకు ఇది అదనంగా వచ్చిన ప్రశంస అని ట్వీట్ చేశారు.