
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి పునాదులు
ఏడేండ్లలో అద్భుతమైన మార్పు
వ్యవసాయ అనుబంధ వృత్తుల బలోపేతానికీ ప్రణాళికలు
మాంసం, చేపల ఉత్పత్తిలో మనమే నంబర్ వన్
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నాయీబ్రాహ్మణులు, రజకులకు విద్యుత్ మీటర్ల పంపిణీ
‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చెయ్యాలన్నదే
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. అందులో భాగంగా మొదట వ్యవసాయ రంగం మీద రైతాంగానికి నమ్మకాన్ని పెంచడంతోపాటు అనుబంధ రంగాలు, కుల వృత్తుల
బలోపేతానికి కూడా ప్రణాళికలు రూపొందించారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. నాయీబ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్ మీటర్ల పంపిణీ కార్యకమాన్ని సూర్యాపేటలో శనివారం సాయంత్రం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొర్రెల కాపరులకు సబ్సిడీపై జీవాలు, మత్స్యకారులకు చేప పిల్లలు, వాహనాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమంపైనా దృష్టి పెట్టారన్నారు. ఆర్ధిక భారం పడుతున్నా ఉచిత విద్యుత్ సరఫరాకు నిర్ణయించడం చరిత్రాత్మకమన్నారు.
చితికి పోయిన వ్యవస్థలకు చికిత్స చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. దాంతో మాంసం, చేపల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో నిలిచిందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమ కారణమని అన్నారు. కుల వృత్తులకు ఉచిత విద్యుత్ అవసరమని ప్రతిపాదనలు రావడంతో ప్రభుత్వం మీద ఎంతటి భారం పడినా ఖాతరు చేయకుండా మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటికే మీటర్లు ఉంటే వారికి ఉచితంగా విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్నారని, లేని వారికి ప్రభుత్వమే మీటర్లు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. సీఎం ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని సూర్యాపేటలో ప్రారంభించినట్లు వెల్లడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,800 మందికి ఉచితంగా విద్యుత్ మీటర్లు అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఆర్డీఓ రాజేంద్రకుమార్, విద్యుత్ ఎస్ఈ పాల్‌రాజ్, డీఈ వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ అధికారి ఉపేంద్ర, రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు కొండూరు సత్యనారాయణ, జంపాల శ్రీను, చెరుకు వెంకన్న పాల్గొన్నారు.